జులై 12, 2021
శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి,
ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
విషయం: అమ్మ భాషను అదిమేసే చర్యలు- అసందర్భ నిర్ణయాలూ
సూచిక: నవ సూచనలు (విధేయతతో) లేఖ 5
అది 2008వ సంవత్సరం… అక్టోబర్ 31వ తేదీ.. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులందరూ సంతోషించిన రోజు అది. ఎందుకో తెలుసా…. తెలుగును ప్రాచీన భాషగా గుర్తించిన రోజు అది. ఒడిసా, కర్నాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, అండమాన్ అండ్ నికోబార్ దీవులు సైతం తెలుగు భాషకు గుర్తింపునిచ్చాయి. అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న భాషగా తెలుగు గుర్తింపు తెచ్చుకున్నది. ఎందరో మహానుభావులు తెలుగును ఈ స్థాయిలో తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేశారు.
మహనీయుల్ని మనం గుర్తుంచుకోకపోయినా ఫర్వాలేదు కానీ వారు చేసిన కృషిని తుడిచిపెట్టేయడం మాత్రం క్షంతవ్యం కాదు. తెలుగు భాషను మహత్తరమైన విద్యా బోధన సాధనంగానూ, ఉన్నత పరిపాలనా వాహకంగానూ తీర్చిదిద్దడానికి సూచలను ఇవ్వాలని 1966 డిసెంబర్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించింది. దీనికి ఐసిఎస్ అధికారి జెపిఎల్ గ్విన్ అధ్యక్షులుగా పని చేశారు. ఆయన చేసిన సూచనతోనే తెలుగు భాషా సంస్థ ఏర్పాటు నిర్ణయం తీసుకుని 1968 జూన్ 12న తెలుగు అకాడమీ ఏర్పాటు చేశారు.
1966 కొఠారీ కమిషన్ నివేదిక ప్రకారం కాలేజీ స్థాయిలో కూడా మాతృభాషను బోధనా మాధ్యమంగా చేశారు. ప్రాదేశిక భాషల్లో పాఠ్యగ్రంథాలను, ప్రముఖుల పుస్తకాలను తర్జుమా చేయడానికి 1967 జూన్ నెలలో భారత ప్రభుత్వం ఒక బృహత్ ప్రణాళిక రూపొందించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక్కో ప్రాంతీయ భాషను ఎందరో మహనీయులు ఇటుక మీద ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్లు సుసంపన్నం చేశారు.
ఏ సమస్యనైనా ఒకే కోణం నుంచి మాత్రమే చూసే మీకు రెండో కోణం గురించి చెప్పేందుకే నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. అందుకే మీరు తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడమీగా మార్చడంపై తెలుగు భాష ఔన్నత్యాన్ని మీరు అర్ధం అయ్యేలా చెప్పేందుకు నా ప్రయత్నం ఇది.
తెలుగు అకాడమీని పలుచన చేయడం ద్వారా మీరు తెలుగు ప్రజలకు ఏం సందేశం ఇవ్వనున్నారో ఎవరికి అర్ధం కావడం లేదు. ప్రాధమిక విద్యలో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలని శతవిధాలా ప్రయత్నం చేసినప్పుడే మీరు తెలుగు భాషను తుడిచిపెట్టే సాహసం చేస్తున్నారని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఆందోళనకు కొనసాగింపుగా ఇప్పుడు తెలుగు అకాడమీ లో సంస్కృతాన్ని చేర్చే ఏకపక్ష నిర్ణయం తీసేసుకున్నారు.
దేవ భాష అయిన సంస్కృతాన్ని ప్రోత్సహించడాన్ని ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ తెలుగును చంపేసే ఉద్దేశ్యంతో నిర్ణయాలు తీసుకోవడం మరింత తీవ్రమైన ఆందోళన కలుగుతున్నది. సంస్కృత భాష ను పరిరక్షించేందుకు జాతీయ స్థాయిలో సంస్కృత అకాడమీ ఉంది. మనం మన ప్రాచీన భాష, మన ప్రాంతీయ భాష అయిన తెలుగును కాపాడుకోవడానికి పని చేస్తే సరిపోతుంది. అలా కాకుండా మీరు సంస్కృతంతో మొదలు పెట్టి, దేశంలోని మీకు నచ్చిన ఇతర ప్రాంతీయ భాషలను కూడా ఇందులో కలుపుతారేమోనని తెలుగు భాషా ప్రేమికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
మీ వ్యవహార శైలిని చూసి ఎంతో మంది భయంతో నోరు విప్పడం లేదు. అంతెందుకు తెలుగు భాషకు ఏ మాత్రం ప్రాధాన్యత తగ్గినా, ప్రాధాన్యత తగ్గడం కాదు…. ప్రారంభోత్సవ శిలాఫలకంపై తెలుగు అక్షరాలు లేకపోయినా నానా యాగీ చేసే యార్లగడ్డలు తెలుగు భాషలో జీవోలు ఇచ్చే సాంప్రదాయాన్ని కూడా మానేసినా నోరు మెదపడం లేదు.
బ్రిటీష్ పాలకులు నిర్దాక్షిణ్యంగా ప్రాంతీయ భాషలను తొక్కేసి వ్యవహార భాషగా ఇంగ్లీష్ ను తీసుకువచ్చారు. ఆ నాటి నుంచి కోర్టుల్లో కూడా ఇంగ్లీష్ భాషనే ఇంతకాలం వాడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలని, న్యాయస్థానాలలో ప్రాంతీయ భాషలు తీసుకురావాలని ప్రయత్నాలు మమ్మరం చేశారు.
తెలుగు భాషను భుజాలపై మోసిన వారు, తెలుగు భాషే జీవితంగా గడిపిన వాళ్లు కూడా ఇప్పుడు మీ నిర్ణయం చూసిన తర్వాత మౌనంగా ఘోషిస్తున్నారు. ఎంత మంది వ్యతిరేకిస్తే అంత గొప్ప నిర్ణయం తీసుకున్నట్లు భావించడం మీకు పారిపాటిగా మారిందని నాకు తెలుసు. కానీ పాపం తెలుగు ప్రేమికులకు తెలియదు. అందుకే వారి ఆవేదనను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. అసలు ఇలాంటి విచిత్రమై ఆలోచన మీకు ఎలా వచ్చిందా అని తెలుగు భాషా ప్రేమికులు అందరూ తలలు పట్టుకున్నారు.
తెలుగు భాషను భూస్థాపితం చేసే కార్యక్రమంలో భాగంగానా అన్నట్లు సంస్కృతానికి పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పడం ‘‘తల్లికి అన్నం పెట్టని వాడు పినతల్లికి పట్టుచీర తెచ్చాడన్నట్లు’’ అనే సామెతను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
మీకు బాగా అర్ధం అయ్యే భాషలో తెలుగు గురించి మరింత వివరంగా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. ఆనాడు ఎందరో మహానుభావులు చేసిన కృషి ఫలితంగా ఏర్పడిన తెలుగు అకాడమీకి ఈనాడు దాదాపుగా 245 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అవన్నీ
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ లోని షెడ్యూల్ 10లో ఉన్నాయి. తెలుగు అకాడమీ ఆస్తులన్నీ ఇప్పుడు తెలంగాణ భూభాగంలోనే ఉండిపోయాయి. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మన రాష్ట్రానికి అందులో 58 శాతం వాటా రావాల్సి ఉంటుంది. దాని కోసం ప్రయత్నం చేయండి అనే ఈ వివరం చెబితే మీలో తెలుగు భాష పట్ల మళ్లీ ఆసక్తి కలుగుతుందేమోనని కొందరు భాషాభిమానులు నాతో చెబితే నేను మీకు ఈ లేఖ ద్వారా సూచిస్తున్నాను.
ఒక్క సారి మీరు ఒడిసా, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర లలోని తెలుగు ప్రాంత ప్రజలు నివసించే చోటుకు వెళ్లి రండి. జీవన అవసరాలకు తగ్గట్టు ఆయా ప్రాంతీయ భాషలు నేర్చుకున్నా కూడా వారంతా ఇంటి వద్ద తెలుగే మాట్లాడుకుంటారు. తాము తెలుగు వారం అని గర్వంగా చెప్పుకుంటారు. తమ పిల్లలకు, వారి పిల్లలకు తెలుగు నేర్పేందుకు, తెలుగు సంస్కృతిని అలవాటు చేసేందుకు పడరాని పాట్లు పడుతూ కూడా తెలుగును బతికించుకుంటున్నారు.
అమెరికాలో ఉన్న మీ బంధువులను అడిగి చూడండి. వారు కూడా తెలుగు గొప్పతనం గురించి మనకే పాఠాలు చెబుతారు. అలాంటి తెలుగు భాషను ప్రభుత్వ చర్యలతో చిదిమేయడం, భాషను అణచివేయడం, తెలుగు భాషను తుడిచేయడంపై ఎందరో భాషాభిమానులు తీవ్రమైన మనో వేదనతో కాలం గడుపుతున్నారు.
సంస్కృతం దేవ భాష, మనం మాట్లాడుకునేది కాదు. సంస్కృతం గాటన తెలుగును కట్టేయడం అంటే తెలుగును కూడా అటకెక్కించడం లాంటిదే. మీరు తీసుకునే నిర్ణయాలు చూస్తుంటే అసలు మీరు ఏమి ప్రయోజనాలు ఆశించి నిర్ణయాలు తీసుకుంటారో ఎంత తరచి చూసినా ఆర్ధిక నిపుణులకు, భాషా శాస్త్రవేత్తలకు, వివిధ రంగాలలోని ప్రఖ్యాతులకు కూడా అర్ధం కావడం లేదు. మేధావుల సంగతి పక్కన పెట్టినా ప్రజలకు కూడా అర్ధం కాని రీతిలో నిర్ణయాలు తీసుకుంటే మన పార్టీపై ప్రజలు కూడా అంతే స్థాయిలో మనకు అర్ధం కాని రీతిలో నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
మహానుభావుడు పి వి నరసింహారావు విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలుగు అకాడమీ ప్రారంభం అయింది. మీరు ఎన్నికల ముందు ఎంతో ప్రీతిపాత్రంగా పిలుచుకున్న మహానేత, మన ప్రియతమ నాయకుడు డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు భాష కు ప్రాచీన హోదా తెచ్చేందుకు తన వంతు కృషి చేశారు.
మీరు తెలుగు భాష గురించి తెలుసుకున్న తెలుసుకోకపోయినా ఫర్వాలేదు కానీ తెలుగు భాష కోసం తపించిన గత ముఖ్యమంత్రులు, గత విద్యా శాఖ మంత్రులు తీసుకున్న నిర్ణయాలను అయినా ఒక్క సారి తరచి చూడండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న తెలుగు భాషా సౌధాన్ని ఎలా నిర్మించారో అర్ధం అవుతుంది. అప్పుడైనా ఈ సౌధాన్ని కూల్చేయాలన్న ఆలోచన మీ మస్తిష్కం నుంచి దూరం కావచ్చు.
ఇటలీలోని వెనిస్ నగరానికి చెందిన వర్తకుడు నికొలో డా కంటి 15వ శతాబ్దంలో దక్షిణ భారత దేశానికి వచ్చాడు. తెలుగు భాషలోని పదాలు ఇటాలియన్ భాష లాగా అంజతాలు (అచ్చు అంతం) కలిగి ఉండటం గమనించి తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా అభివర్ణించాడు. కన్నడీగుడైన కృష్ణదేవరాయలు తెలుగు భాషను ‘‘దేశ భాషలందు తెలుగు లెస్స’’ అని వ్యవహరించాడు.
చరిత్ర అంతా చెత్త అని కొట్టిపారేసిన వాళ్లు చరిత్రలో కలిసిపోయారు. చరిత్రను తెలుసుకుని, అర్ధం చేసుకుని, విశ్లేషించిన వారు భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారు. తెలుగు భాషను తెలుగు నేలపై లేకుండా చేయాలనే మీ ప్రయత్నాన్ని వివిధ పోస్టుల్లో మీరు నామినేట్ చేసిన వారు హర్షించవచ్చు కానీ యదార్ధం వేరే విధంగా ఉంటుంది. తెలుగు భాషను చిదిమేయడానికి మీకు తెలుగు ప్రజల అనుమతి తప్పని సరి.
చట్టంలో ఎక్కడా ఇంత స్పష్టంగా చెప్పలేదు కానీ ఒక భాషను లేదా ఒక సంస్కృతిని లేకుండా చేయడం అంటే గోహత్య కన్నా మహాపాతకం. పాలుతాగే పిల్లవాడికి తల్లిని దూరం చేసినంత ఘోరం. తెలుగు భాషను పరిరక్షించండి… ప్రోత్సహించకపోయినా ఫర్వాలేదు… దానిమానాన దాన్ని బతకనీయండి అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద అంశాలు ఉటంకించలేము.
తెలుగు రాష్ట్రాలలోని వారే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్లు కూడా మీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయం మీకు మీరుగా తెలుసుకోవాలంటే కూడా ఒక మార్గం ఉంది. తెలుగు భాషను అన్ని స్థాయిలలో తీసేస్తున్నామని, తెలుగు భాషను పలుచన చేసేస్తున్నామని చెబుతూ మీరు ప్రజాభిప్రాయాన్ని (రిఫరెండం) తీసుకోండి.
తెలుగు భాష నిపుణుల అభిప్రాయం తెలుసుకోండి ఈ రెండు వేదికలపైనా మీరు తీసుకున్న నిర్ణయాలను మెజారిటీ వ్యక్తులు ఆమోదిస్తే నిరభ్యంతరంగా మీరు అనుకున్నది చేసేయండి. అంతే కానీ ఎవరి అభిప్రాయం తెలుసుకోకుండా భాషలపై ప్రయోగాలు చేసే ఏకపక్ష కార్యక్రమాలను ఇకనైనా మానుకోండి.
భవదీయుడు
కె.రఘురామకృష్ణంరాజు