రానున్న రోజుల్లో మ్యావ్.. మ్యావ్ అననున్న పులివెందుల పులి
వై నాట్ కుప్పం అని కారు కూతలు కూసే బ్యాచ్ కు టీజర్ తోనే దిమ్మ తిరిగింది
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలు వేసుకొని వచ్చిన రౌడీ లను తరిమి కొట్టిన పులివెందుల ప్రజలు
ఆర్ 5 జోన్ లో ఇండ్ల నిర్మాణం నిర్మాణం కోసం ప్రజాధనం దుర్వినియోగానికి వీల్లేదని హెచ్చరించిన హైకోర్టు
ఋషికొండపై నిర్మాణాలలో ఉల్లంఘనలు స్పష్టమన్న హైకోర్టు… సుప్రీంకోర్టుకు నివేదిస్తామని వెల్లడి
సి ఎఫ్ ఎం ఎస్ లో బాకీ లను నమోదు చేయించండి… లేకపోతే మీ డబ్బులు మీకు రావడం కష్టం
రానున్న ఎన్నికల్లో పులివెందులలో మా అధ్యక్షుడే ఓడిపోతే, పార్టీ పరిస్థితి ఏమిటో నన్న ఆందోళన క్రమశిక్షణ కలిగిన నాలాంటి కార్యకర్తలను వేధిస్తోంది.
పులివెందుల పులి రానున్న రోజుల్లో మ్యావ్ మ్యావ్ అనే పిల్లిగా మారుతుందేమో… ఇప్పుడు గాండ్రించే పులి కాస్త, రేపు మ్యావ్… మ్యావ్ అంటుందేమో. వై నాట్ కుప్పం అని పోలీసులను అడ్డం పెట్టుకొని తింగరి వేషాలు వేస్తే తోలు తీసే పరిస్థితి వస్తుందని నిన్నటి పులివెందుల సభ ద్వారా స్పష్టమయ్యింది . వై నాట్ 175 అని కారు కూతలు కూసిన బ్యాచ్ కు నిన్నటి టీజర్ తోనే దిమ్మ తిరిగి ఉంటుంది. టీజర్ గ్రాండ్ సక్సెస్ కావడంతో ముత్యాలముగ్గు చిత్రంలో సంగీత మాదిరిగా మా పార్టీకి చెందిన ఎంపీ, పేరు చివరన రెండు అక్షరాలు ఉన్న నాయకులు పసుపు నీళ్లతో పులివెందుల పూల అంగడికి ప్రాంగణాన్ని కడిగారట అంటూ నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.
గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… కడగటం అలవాటయిన వారు పులివెందుల పూల అంగడిని కూడా పసుపు నీళ్లతో కడిగారని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి దీటైన సమాధానం ఇచ్చారు. కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి మరి కొంతమంది శుద్ధి చేయడం ఎలాగో ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు కూడా అదే పని చేశారని బీటెక్ రవి అన్నారని పేర్కొన్నారు. పులివెందులలో పసుపు వాన కురిసింది.
పెద్దాయన ప్రసంగాన్ని ముగించి వెళ్ళబోతుంటే… వెళ్లడానికి వీలు లేదని “సార్… ఫలానా కుర్రాడు వేసిన హత్య గురించి మాట్లాడండి… రక్తపు మరకలను ఎలా కడిగారో చెప్పండి” అని అడిగి మరీ మాట్లాడించుకున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. పులివెందుల పూల అంగడిలో పసుపు పచ్చ పూలు చల్లి, ఆ పూల పైనే వాహనాలను నడిపించారు.
స్థానిక ఎమ్మెల్యే పరదాలు కట్టుకొని, భారీకేడ్లు ఏర్పాటు చేసుకుని బితుకు బితుకుమంటూ పులివెందులకు వెళ్తుండగా, నిజమైన సింహంలా షంషేర్ గా వాహనం ఎక్కి చంద్రబాబు నాయుడు పులివెందులలో పులిలా ప్రవేశించారు. రేపు పులివెందుల పేరును స్థానిక ఎమ్మెల్యే పిల్లివెందుల అని మార్చుకుంటే మంచిది. పులివెందులలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సభకు స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రౌడీలు ఆటంకాన్ని కలిగిస్తారని ముందే ఊహించాను. అనుకున్నట్లుగానే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీలు వాహనాలకు జెండాలను కట్టుకొని సభా ప్రాంగణానికి విచ్చేసి అలజడి సృష్టించబోతే, స్థానికులు తరిమి, తరిమి కొట్టిన సీన్ చూస్తే రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు రానున్నాయని స్పష్టమవుతుంది.
ఈ సందర్భంగా ఒక సింహాన్ని తిరగబడి దుప్పి తరిమికొట్టిన వీడియోను మీడియా ప్రతినిధుల ముందు రఘురామకృష్ణం రాజు ప్రదర్శించారు. ఎక్కడైతే ప్రజల్లో చైతన్యం వచ్చిందో, అక్కడి ప్రజలే మీ ఉడుత ఊపులకిక భయపడి లేదని స్పష్టం చేశారు. ఇకపై పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే చిడతలు వాయించినట్టు వాయిస్తామని సంకేతాలను ఇచ్చారు.
ఒక సినిమాలో హీరో బాలకృష్ణ చెప్పినట్టుగా నీ ఊరుకు వచ్చాను… నీ ఇంటికి వచ్చాను అన్నట్లుగా చంద్రబాబు నాయుడు పులివెందులలో అడుగుపెట్టారు. పులివెందుల ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు నాయుడుని జగన్మోహన్ రెడ్డి ముసలివాడు అని సంభోదిస్తున్నారు. కానీ ఆయనేమో అలవోకగా రెండు మూడు అంతస్తుల బిల్డింగులను ఎక్కుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులను తిరిగి ఒక లెక్చరర్ మాదిరిగా ఈ ప్రభుత్వ హయాంలో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టుల గురించి వివరిస్తుంటే, ప్రొఫెసర్లు సైతం నివ్వరపోయే పరిస్థితి నెలకొంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఆయన ఏకరువు పెడుతుండగా, మనము నాలుగు మాటలు మాట్లాడాలంటేనే బ్బబ్బ.. బెబ్బే అంటామని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు.
సాగునీటి ప్రాజెక్టులపై ప్రధాన ప్రతిపక్ష నేత చేస్తున్న విమర్శల గురించి నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడుతారేమోనని అనుకుంటే, ఆయనేమో బ్రో సినిమా హిట్ కాలేదు అని దీర్ఘాలు తీస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత నేమో సాగునీటి ప్రాజెక్టుల గురించి వివరిస్తూ ప్రజల మధ్యలోనే ఉంటూ, సభలను నిర్వహిస్తున్నారు. 32 ఈడీ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులతో శ్యాం బాబు కాదు, కాదు రాంబాబు ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తారట. ఇటువంటి వారు ఫిర్యాదు చేయగానే కం కంప్లైంట్ తీసుకుంటారా?, ఎందుకు తీసుకుంటారని ప్రశ్నించారు.
పులివెందుల ఎమ్మెల్యే బీటెక్ రవి అని నిర్ధారించుకున్న సీమ ప్రజలు
పులివెందుల కాబోయే ఎమ్మెల్యే బీటెక్ రవి అని కడప జిల్లా ప్రజలే కాదు… రాయలసీమ ప్రజలు కూడా నిర్ధారించుకున్నారు. పులివెందులలో ఆ జన ప్రభంజనం చూస్తే, బీటెక్ రవికి ఉన్న ప్రజాదరణ ఏ పాటిదో అర్థమవుతుంది. పులివెందుల నిజమైన పులి బీటెక్ రవి. రాష్ట్రంలో ఒకవైపు చంద్రబాబు నాయుడు తిరుగుతుండగానే, మరొకవైపు ఎల్లుండి నుంచి వారాహి వాహన దారుడై పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాలలో పర్యటించనున్నారు. నేను కూడా త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనున్నాను. నన్ను కూడా దుప్పి అని అనుకుంటున్నారేమో, తిరగబడి సింహాన్ని కూడా పొడిచి వేయగలనని రఘు రామకృష్ణంరాజు హెచ్చరించారు.
ఋషికొండపై ఉల్లంఘనలే… ఉల్లంఘనలు
ఋషికొండపై నిర్మించిన భవన నిర్మాణాలలో ఉల్లంఘణలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాష్ట్ర హైకోర్టు అభిప్రాయపడింది. ఋషి కొండపై పూర్తి తీర్పు వెలువడినప్పటికీ, న్యాయమూర్తులు తమ మనసులోని అభిప్రాయాన్ని చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర అజమాయిషీ లోని అటవీ పర్యావరణ శాఖకు ప్రతిపాదిస్తామని తెలిపారని రఘు రామ కృష్ణంరాజు వెల్లడించారు. ఋషికొండ అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర హైకోర్టును ఎమ్మెల్యే రామకృష్ణ బాబు, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆశ్రయించారు. ఇదే విషయమై నేను ఎన్జీటీకి లేఖ రాయగా సుమోటోగా కేసు నమోదు చేశారు. ఎన్జీటీ సుమోటో గా కేసు నమోదు చేయడాన్నీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లి , ఈ విషయం హైకోర్టులో పెండింగులో ఉందని నివేదించింది.
ఋషి కొండపై నిర్మాణాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘనలకు పాల్పడరాదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. గతంలో నిర్మాణాలు ఉన్నచోట మాత్రమే పునర్నిర్మానాలు చేపట్టాలని సూచించింది. నిర్మాణాలు తొలగించిన చోటనే భవన నిర్మాణాలకు అనుమతినిస్తూ 2022 జూన్ 1వ తేదీ న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను జెమోరె ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘించింది. టూరిజం ప్రాజెక్టు పేరిట ముఖ్యమంత్రి నివాస భవనాన్ని, కార్యాలయాన్ని నిర్మించుకున్నారు.
దసరాకు రుషికొండపై నిర్మించుకున్న భవనంలోకి జగన్మోహన్ రెడ్డి దంపతులు అడుగు పెట్టనున్నారట. వారు ఋషికొండ పై నిర్మించుకున్న భవనంలోకి అడుగుపెడితే, ఉత్తరాంధ్రకు మంచి రోజులు రానున్నాయని స్థానిక మంత్రి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. విశాఖలో ఎంతోమంది ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో పులివెందుల జంట ఒకటి వచ్చి కొత్తగా చేరుతుంది తప్పితే , కొత్తగా విశాఖపట్టణానికి, ఉత్తరాంధ్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదు. రుషికొండపై హైకోర్టు ఇచ్చే తీర్పు లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పొందుపరచడం ఖాయం. గతంలో కొండపై చిన్నచిన్న కాటేజీలు ఉండేవి. కానీ ప్రస్తుతం కొండ కింది భాగాన సి ఆర్ జెడ్ జోన్ లో భవన నిర్మాణాలను చేపట్టారు. రేపు ఢిల్లీకి ఈడీ కేసుల బ్యాచ్ వచ్చి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి, మీరు ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతు ఇస్తామని, ఈ విషయంలో తమకు మద్దతు నివ్వాలని కోరుతారు.
ఇప్పటికే ఆర్ 5 జోన్ లో ఇండ్ల నిర్మాణ విషయంలో పరువు పోయింది. తలెత్తుకోలేకపోతున్నాము. ఇది కూడా అయ్యిందంటే సిగ్గుతో చచ్చిపోవలసి వస్తుందని కేంద్ర పెద్దల సహకారంతో అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖను మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తే, నేను చూస్తూ ఊరుకోను. సుప్రీంకోర్టును ఆశ్రయించి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తాను. వదిలే ప్రసక్తే లేదు. ఇప్పటికైనా పిచ్చిపిచ్చి వేషాలు ఆపేస్తే మంచిది. న్యాయం జరిగే వరకూ పోరాడుతాను. ప్రజా న్యాయస్థానంలో ఈ ప్రభుత్వ అక్రమాలను ఎండగడుతానని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు.
ప్రతిపక్ష పార్టీలకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి
ఢిల్లీలో బిజెపి నేతలు చేతులు లేపితే సంక నాకుతామనే విధంగా, షూ విప్పితే కాళ్లు నాకుతామనే విధంగా వ్యవహరిస్తున్న మా పార్టీ పెద్దలు, రాష్ట్ర బిజెపి నాయకత్వం పై మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలను గౌరవించడమన్నది నేర్చుకోవాలి. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి గారిని ఉద్దేశించి మీ బావ కళ్ళల్లో ఆనందం కోసమా అని మాట్లాడడం సిగ్గుచేటు. ఇలా మాట్లాడితే ప్రజలు చెప్పుచుకొని కొడతారని తెలియదా?, మనం మన హద్దుల్లో ఉంటే, ఎదుటివారు కూడా వారి హద్దుల్లో ఉంటారు. మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు అన్ పార్లమెంటరీ పదజాలం ఉపయోగించడం దురదృష్టకరం. విజయసాయిరెడ్డి చేస్తున్న ట్వీట్లు ఆయన రాయడం లేదేమో… వేరే వాళ్లు రాస్తున్నారేమోనని అనుమానంగా ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం 1.77 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని పార్లమెంట్ వేదికగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెబితే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని అంటారేమిటి అని ప్రశ్నించడం ఆయన అజ్ఞానాన్ని తెలియజేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 10.77 లక్షల కోట్ల రూపాయలని ఆధారాలతో సహా వెల్లడించాం. పని చేయించుకుని డబ్బులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వం పై రెండు లక్షలకు పైగా కేసులు వేశారు. 12 వేల కోర్టు ధిక్కరణ కేసులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై న్యాయస్థానాలలో ఫైల్ చేయబడ్డాయి. దేశంలోని 40 శాతం కేసులు ఇక్కడే నమోదయ్యాయి. కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చిన వారిని, పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించమని ఆదేశించిన న్యాయమూర్తులను తమ పలుకుబడిని ఉపయోగించి ఎక్కడకు ట్రాన్స్ఫర్ చేయించారో అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశించిన పనులను చేసిన కాంట్రాక్టర్లను 10 లక్షల నుంచి మొదలుకొని ఐదు కోట్ల రూపాయల వరకు బిల్లును రావలసిన కాంట్రాక్టర్ల బకాయిలే 1,50,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. గతంలో సి ఎఫ్ ఎం ఎస్ లో పాత బకాయిలను చూపించేవారు. కానీ ప్రస్తుతం పాత బకాయిలను చూపించడం లేదు. అంటే ఆ బకాయిలను లెక్కించడం లేదని స్పష్టం అవుతుంది. ఈ ప్రభుత్వం మారడం గ్యారెంటీ. వచ్చే ప్రభుత్వమైనా బిల్లులు చెల్లించాలంటే కాంట్రాక్టర్లు సి ఎఫ్ ఎం ఎస్ లో తమ బకాయిలను చేర్పించాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.
సుప్రీంకోర్టుకు వెళితే జోడుచ్చుకుని కొడతారు
అమరావతి ఆర్ 5 జోన్ లో ఇండ్ల నిర్మాణానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి వీలు లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా జగన్ కాటుకు హైకోర్టు దెబ్బ తగిలింది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి మూడు కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లో వెళ్లి, మహిళలను రాకుండా నిర్బంధించి దీనబంధువుడి అవతారం ఎత్తిన జగన్మోహన్ రెడ్డికి తోలు చెప్పు నీళ్లలో నానబెట్టి దవడ మీద బాదినట్లుగా హైకోర్టు తీర్పునిచ్చింది. ఒక ఉల్ఫా మంత్రిని వెంటేసుకొని వెళ్లి తన హృదయ వేదనను ఆవిష్కరించి పేదవారికి ఇండ్లు కట్టిస్తామంటే ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓర్వలేకపోతున్నారని జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పటికీ, ఆర్ 5 జోన్లో ఇండ్ల నిర్మాణానికి హై కోర్ట్ అభ్యంతరం తెలిపింది.
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళితే వెళ్ళవచ్చు. ఇక్కడ చెప్పుచ్చుకొని కొట్టారు… అక్కడ జోడుతో కొడతారు. ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి నీ అబ్బా బాబు సొత్త అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అమరావతి రైతుల తరఫున ప్రజాస్వామ్య వాదుల తరఫున ఈ కేసును అద్భుతంగా వాదించిన మురళీధర్ రావుకు రఘురామకృష్ణం రాజు ధన్యవాదాలు తెలిపారు. తీర్పును వెల్లడించిన న్యాయమూర్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.