టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ‘మహా రాజ’మౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దుల కొడుతోన్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ల నట విశ్వరూపానికి ఫ్యాన్స్ తో పాటు క్రిటిక్స్ కూడా ఫిదా అయ్యారు. ఇద్దరు స్టార్ హీరోలతో జక్కన్న మలిచిన ఈ భారీ మల్టీస్టారర్ మరో బాహుబలి రేంజ్ లో రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది.
ఆల్రెడీ థియేటర్లలో ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. దీంతో,‘ఆర్ఆర్ఆర్’ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రం డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ దక్కించుకునేందుకు పలు దిగ్గజ సంస్థల మధ్య పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ హక్కుల వివరాలు వెల్లడయ్యాయి. పెన్ స్టూడియోస్, పెన్ మరుధర్ సినీ ఎంటర్టైన్మెంట్స్ ఆ వివరాలను వెల్లడించాయి.
ఆర్ఆర్ఆర్ మూవీని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో జీ 5 సంస్థ స్ట్రీమింగ్ చేయనుండగా. హిందీలో నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రసారం చేయనుంది. ఇక, ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ అయిన ఆర్ఆర్ఆర్ ను వరల్డ్ వైడ్గా ఇంగ్లీష్, పోర్చు గీస్, కొరియన్, తుర్కిష్, స్పానిష్ భాషలలోకీ నెట్ ఫ్లిక్స్ డబ్ చేసి విడుదల చేయనుంది. ఇక, ఈ సినిమా శాటిలైట్ హక్కులను హిందీ వర్షన్ కు గాను జీ సినిమా సొంతం చేసుకుంది. తెలుగులో స్టార్ మా, తమిళ, కన్నడ శాటిలైట్ రైట్స్ ను స్టార్ ఛానెల్స్ దక్కించుకున్నాయి. అలాగే మలయాళం వర్షన్ శాటిలైట్ హక్కుల్ని ఏషియన్ నెట్ దక్కించుకుంది. భారీ రేట్లు చెల్లించి మరీ ఈ హక్కులను సదరు సంస్థలు, ఛానెళ్లు దక్కించుకున్నాయట.
వాస్తవానికి విడుదలైన మూడు నెలలకు గానీ ఈ చిత్రం ఓటీటీలోకి తీసుకురాబోమని రాజమౌళి చెప్పారు. దీంతో జూన్ తర్వాతే సినిమా ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 20న లేదా మే మొదటి వారంలో ఈ విజువల్ గ్రాండీర్ ఓటీటీలో రిలీజ్ కాబోతోందని మరో పుకారు వినిపిస్తోంది. అయితే, ఓటీటీ రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు.