టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. జక్కన్న చెక్కుతోన్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో జక్కన్న మలిచిన ఈ భారీ మల్టీస్టారర్ మరో బాహుబలి కానుందని అంచనాలున్నాయి.
ఆ అంచనాలకు తగ్గట్టుగానే ‘ఆర్ఆర్ఆర్’ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ కోసం దిగ్గజ సంస్థల మధ్య పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆర్ఆర్ఆర్.. డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ హక్కుల వివరాలు వెల్లడయ్యాయి. ఈ చిత్రాన్ని హిందీలో పంపిణీ చేస్తున్న పెన్ స్టూడియోస్, పెన్ మరుధర్ సినీ ఎంటర్టైన్మెంట్స్ ఆ వివరాలను వెల్లడించాయి. ఆర్ఆర్ఆర్ మూవీని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో జీ 5 సంస్థ స్ట్రీమింగ్ చేయనుంది. హిందీలో నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రసారం చేయనుంది. ఇక, ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ అయిన ఆర్ఆర్ఆర్ ను వరల్డ్ వైడ్‌గా ఇంగ్లీష్, పోర్చు గీస్, కొరియన్, తుర్కిష్, స్పానిష్ భాషలలోకీ నెట్ ఫ్లిక్స్ డబ్ చేసి విడుదల చేయనుంది.
ఈ సినిమా శాటిలైట్ హక్కులను హిందీ వర్షన్ కు గాను జీ సినిమా సొంతం చేసుకుంది. తెలుగులో స్టార్ మా, తమిళ, కన్నడ శాటిలైట్ రైట్స్ ను స్టార్ ఛానెల్స్ దక్కించుకున్నాయి. అలాగే మలయాళం వర్షన్ శాటిలైట్ హక్కుల్ని ఏషియన్ నెట్ దక్కించుకుంది. ఇక హిందీలో థియేట్రికల్ రైట్స్‌ను పెన్ మరుధర్ సినీ ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.