ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైనపుడు రాజమౌళి వీకెస్ట్ మూవీస్లో ఒకటనే కామెంట్లు వినిపించాయి. ఓవరాల్ టాక్ కొంచెం డివైడ్గానే వచ్చింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసింది. ఇండియాలో బ్లాక్ బస్టర్ కావడమే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో అద్భుతాలు చేసింది. హలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సహా ఎంతోమంది అంతర్జాతీయ సినిమా ప్రముఖులను ఈ చిత్రం కట్టి పడేసింది.
ఏ ఇండియన్ సినిమాకూ లేని స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో దీనికి ప్రశంసలు లభించాయి. అమెరికాలో ‘ఆర్ఆర్ఆర్’ను నేటివ్ అమెరికన్స్ ఎగబడి చూశారు. ఆ తర్వాత ఈ చిత్రాన్ని జపాన్లో రిలీజ్ చేస్తే అక్కడ ఇంకా అద్భుతమైన ఆదరణను దక్కించుకుంది. ఏకంగా వంద రోజుల పాటు ఫుల్ ఆక్యుపెన్సీలతో సినిమా నడిచింది. ఆ తర్వాత కూడా చాన్నాళ్ల పాటు రన్ కొనసాగింది.
విశేషం ఏంటంటే.. జపాన్లో ‘ఆర్ఆర్ఆర్’ అద్భుతాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఓ ప్రముఖ థియేటర్లో ‘ఆర్ఆర్ఆర్’ జపనీస్ వెర్షన్ ఆడుతుండడం విశేషం. జపాన్లోని ఒక ఫేమస్ థియేటర్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఏకంగా ఒక సంవత్సరం 9 నెలలు నిర్విరామంగా ఆడడం విశేషం. ఇంకా కూడా ఆ సినిమాను థియేటర్ నుంచి తీయలేదు. మన దగ్గర కొన్ని దశాబ్దాల కిందట సినిమాలు సంవత్సరం పాటు ఆడేవి. కానీ ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా 50 రోజులు ఆడడం కూడా గగనంగా మారింది.
కొన్ని సినిమాలను వంద రోజులు, సంవత్సరం పాటు ఒకటి రెండు థియేటర్లలో ఆడించడం చూస్తున్నాం కానీ.. అది అభిమానులు లేదా డిస్ట్రిబ్యూటర్లు డబ్బులిచ్చి ఆడించేదని అందరికీ తెలుసు. కానీ మన సినిమా వేరే దేశంలో ఇలా ఏడాది 9 నెలల పాటు ఆడడం.. ఇంకా రన్ కొనసాగుతుండడం మామూలు విషయం కాదు. దీన్ని బట్టే జపనీస్ ప్రేక్షకులు ‘ఆర్ఆర్ఆర్’ను ఎంతగా మెచ్చారో అర్థం చేసుకోవచ్చు.