దక్షిణాది చిత్ర పరిశ్రమతోపాటు యావత్ భారత దేశం గర్వించదగ్గ మేటి దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. ఇక, అమెరికా చరిత్రలో ఏ తెలుగు సినిమా విడుదల కాని రీతిలో దాదాపు 1150 థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. రికార్డు స్థాయిలో 2.5 మిలియన్ డాలర్లు ప్రీ బుకింగ్ రూపంలోనే వసూలు చేసిందంటే ఈ చిత్రం స్టామినా ఏమిటో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే బే ఏరియాలో ‘ఆర్ఆర్ఆర్’ విడుదల సందర్భంగా జూ.ఎన్టీఆర్, చరణ్ అభిమానులు రచ్చ రచ్చ చేశారు.
సాధారణంగా ఒక్క స్టార్ హీరో సినిమాకే థియేటర్ల దగ్గర ఎన్నారైల రచ్చ మామూలుగా ఉండదు. అటువంటిది ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడంతో ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర దుమ్ము రేపారు. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ సందర్భంగా బే ఏరియాలో తారక్, చరణ్ ఫ్యాన్స్ భారీ కార్ ర్యాలీ చేశారు. మొట్ట మొదటిసారిగా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కలిసి భారీ ఫంక్షన్ చేశారు. చరణ్, తారక్ ల భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన అభిమానులు…కొబ్బరి కాయలు కొట్టడం, ఇద్దరు హీరోల చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం, ఫ్లాష్ డ్యాన్స్ వంటి కార్యక్రమాలతో థియేటర్ల దగ్గర మంటపుట్టించారు.
అనకాపల్లి నుంచి అమెరికా దాకా…ఈ చిత్రం హిట్ టాక్ తో దూసుకుపోతోంది. విడుదలైన ప్రతి చోటా ఈ సినిమా బంపర్ హిట్ టాక్ తో రికార్డు కలెక్షన్లు కొల్లగొడుతోంది.భారతీయ సినీ చరిత్రలో ఈ సినిమా ఓ మైలు రాయి అని సినీ విమర్శకులతోపాటు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక, ఈ చిత్రంతో తారక్, చరణ్ లు మరో లెవల్ కు ఎదిగి పాన్ ఇండియా స్టార్లుగా వెలుగుతారని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
గురువారం విడుదలైన ఈ చిత్రం బే ఏరియాలో పండుగ వాతావరణాన్ని తెచ్చింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో ఈ వీకెండ్ అమెరికాలో ‘ఆర్ఆర్ఆర్’ ఫీవర్ మరింత పెరగనుంది. అజయ్ యార్లగడ్డ, వీరబాబు ప్రత్తిపాటి, లక్ష్మణ్ పరుచూరి, మురళి గూడవర్తి , సాయి కంభంపాటి, గౌతమ్, మధు, వినయ్, సత్యనారాయణ,వరుణ్, సౌజన్య, ప్రత్యూష, సునీల్ పసుపులేటి, శివ మూలబంటి, అనిల్ అరిగె ,రవి కిరణ్ అలేటి, శ్రీకాంత్ దొడ్డపనేని, సతీష్ బొల్లా, గంగా కోమటి, సుబ్బారావు తలచిరు, ప్రకాష్, సందీప్ ఇంటూరి తదితరులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.