నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారిస్తున్నారు.
సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ నేతృత్వంలో ఈ విచారణ సాగుతోంది.
రఘురామ కృష్ణంరాజు చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించిన సమాచారం, సాంకేతిక సహకారం ఎక్కడి నుంచి అందుతుందని ప్రశ్నించారు.
విద్వేషపూరిత వ్యాఖ్యలతో రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేలా కుట్ర పన్నారంటూ సీఐడీ ఏడీజీ అన్నారు.
ఆయన ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లేలా చేశారని.. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలుజేసేందుకు ప్రయత్నించారని అన్నారు.
తన మాటలు, ప్రసంగాలతో వివిధ వర్గాల మధ్య విధ్వేషం పెంచేలా ఆయన ప్రయత్నించారని ఏడీజీ చెప్పారు.
అందుకే ఆయనపై 124ఏ, 153ఏ, 505, 120బీ సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు చెప్పారు.
కాగా అంతకుముందు ఈ రోజు ఉదయం రఘురామకృష్ణం రాజుకు టిఫిన్ ఇంటినుంచే రాగా సీఐడీ అధికారులు దాన్ని అనుమతించారు.
మరోవైపు రఘురామకృష్ణంరాజు అరెస్ట్ సరైనదేనంటూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు అంటున్నారు.
గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ.. ‘‘రఘురామకృష్ణంరాజు 14 నెలలు నుండి ఢిల్లీలో కూర్చుని తనను గెలిపించిన ప్రజలను గాలికొదిలేశారు. కనీసం వారి బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదు.
ఈ సమయంలో ఎంపీని అరెస్టు చేయడం సరికాదంటున్న ప్రతిపక్ష పార్టీలు తీరు సరికాదు.
అసలు ప్రతిపక్ష పార్టీలకు రఘురామకృష్ణరాజు మీద ఎందుకు అంత ప్రత్యేక శ్రద్ధ.
పశ్చిమగోదావరి జిల్లా అంటే ప్రశాంతంగా ఉన్న జిల్లా. ఇలాంటి ప్రాంతంలో ఒక చీడపురుగుని ఎంపీగా ఎన్నుకున్నామని ప్రజలు సిగ్గుపడుతున్నారు.
అందరూ సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్న ఎంపీపై నేను సైతం కేసు పెట్టడం జరిగింది.
ప్రజల మనోభావాలు, ఆచారాలు రఘురామకృష్ణరాజుకు అవసరం లేదు. అలాంటివారికి గుణపాఠం అవసరం.
జగన్మోహన్ రెడ్డి ఫోటో తో రఘురామకృష్ణరాజు గెలుపొందారు కానీ, తన పేమ్ తో గెలవలేదు.
సంక్రాంతి సమయంలో కోడి పందాలపై కేసులు వేస్తూ ప్రచారం పొందే వ్యక్తి రఘురామకృష్ణరాజు
రఘురామకృష్ణరాజు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’ అన్నారు.
వైయస్ఆర్ సీపీ నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు మాట్లాడుతూ… ‘‘ఇప్పటికే రఘురామకృష్ణరాజు మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఇంతకాలం ఉపేక్షించిది.
కొన్ని వర్గాలపైన రఘురామకృష్ణరాజు విద్వేషపూర్వక వ్యాఖ్యలు చేస్తున్నారు, తద్వారా ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెంచాలన్నది ఆయన ప్రయత్నంగా ఉంది.
ప్రతిరోజూ విద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడం ద్వారా పథకం ప్రకారం, నిర్మాణాత్మకంగా కొన్ని వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి రఘురామకృష్ణరాజు ప్రయత్నిస్తున్నారు.
ప్రభుత్వంలోని వివిధ హోదాల్లో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేసి, ప్రభుత్వ వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా చేయడానికి రఘురామకృష్ణంరాజు ప్రయత్నిస్తున్నారు.
ఉద్దేశ పూర్వక చర్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకొచ్చేలా, చెడ్డపేరు తీసుకువచ్చేలా రఘురామకృష్ణంరాజు యత్నిస్తున్నారు.
దీనికోసం ఆయన ఇప్పటికే పలుమార్లు యత్నించారు.
కొన్ని మీడియా ఛానళ్ల సహకారంతో రఘురామకృష్ణంరాజు ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ వర్గాలు, సామాజిక వర్గాలు మధ్య ద్వేషాన్ని పెంచి శాంతిభద్రతల సమస్యను సృష్టించాలనే ఆయన ఉద్దేశం’’ అన్నారు.
వైయస్ఆర్ సీపీ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘రఘురామకృష్ణరాజును అరెస్టు చేసి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది.
పిచ్చి కుక్కలా.. రోజు రచ్చబండలో మాట్లాడుతున్న వ్యక్తికి తగిన శాస్తి జరిగింది
జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మహనీయులు క్షత్రియులు..
క్షత్రియ సామాజిక వర్గానికి అపకీర్తి తెచ్చిన వ్యక్తి రఘురామ కృష్ణరాజు
కరోనా సమయంలో ప్రజల సమస్యలను కనీసం పట్టించుకోని బాధ్యత లేని వ్యక్తి ఎంపీ రఘురామకృష్ణరాజు చంద్ర బాబు డైరెక్షన్ లోనే రఘురామకృష్ణరాజు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయి.
రఘురామకృష్ణరాజును అరెస్టు చేయడం ఆలస్యమైన, ఇప్పటికైనా సీఐడీ సరైన చర్య తీసుకుంది.
రఘురామకృష్ణరాజు కుట్ర వెనుక భాగస్వాములైన వారిని కూడా విచారణ చేసి అరెస్ట్ చేయాలి’’ అన్నారు.
ఎంపీ రఘురామకృష్ణరాజుపై ముఖ్యమంత్రి కక్షకు ముఖ్య కారణం, జగన్ బెయిల్ రద్దు చేయమని సీబీఐ కోర్టులో ఆయన ఫిర్యాదు చేయడమేనని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తెలిపారు. నేడు ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
మరోవైపు రఘురామ రాజు అరెస్టును టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఖండిస్తున్నారు.
ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు, విష్ణువర్థన్ రెడ్డి తదితర నేతలు ఆయన అరెస్టును ఖండించారు.
‘‘ఎంపీ రఘురామరాజుపై” ముఖ్యమంత్రి కక్ష్యకు ముఖ్య కారణం, ఆయన బెయిల్ రద్దు చేయమని సీబీఐ కోర్టులో ఫిర్యాదు చేయడం, సీబీఐ కోర్టు దానిని విచారణకు అంగీకరించడం, ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా అభాసుపాలు కావడంమే అసలుకారణం.
న్యాయ వ్యవస్థ కూడా విచారణ ఎదుర్కొంటున్న ముద్దాయిల పట్ల వ్యత్యాసం చూపకూడదు’’ అని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు.