అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై తెలంగాణలోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హైదరా బాద్ పోలీసులు అరెస్టు చేయడం సంచలనం కాకపోయినా..ఆయనపై భారీ సంఖ్యలో కేసులు నమోదు చేయడం.. అందునా.. రౌడీషీట్ ఓపెన్ చేయడం.. పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టడం వంటివిమాత్రం సంచలనంగానే మారాయి. రాత్రికి రాత్రి.. ఏమైనా జరిగిందా? అనే చర్చ జరుగుతోంది.
మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్ పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులపై పోలీసులు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. భారీఎత్తున పోలీసులు షాహినాయత్‌గంజ్‌లోని ఆయన ఇంటికి వెళ్లారు. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ఇంటికి వెళ్లే దారిలోనూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాజాసింగ్‌ను అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. ఆ తర్వాత చర్లపల్లి జైలుకు తరలించారు.
అయితే.. రాజాసింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయడంతోపాటు.. రౌడీషీట్ తెరిచారు. రాజాసింగ్ తరుచూ రెచ్చగొట్టే ప్రసంగాలతో ఘర్షణలు చోటుచేసుకునేలా వ్యవహరిస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ నెల 22న ఓ వర్గాన్ని కించపరిచేలా పెట్టిన వీడియో శాంతిభద్రలకు విఘాతం కలిగించిందని పేర్కొన్నారు. ఈ నెల 23న రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నామని.. మరోసారి వీడియోలు విడుదల చేస్తానని మీడియాకు తెలిపారని పేర్కొన్నారు.
వీడియో కారణంగానే నిరసనలు, ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని.. ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారని సీపీ తెలిపారు. వ్యాపార సముదాయాలూ మూతపడ్డాయన్నారు. 2004 నుంచి ఇప్పటివరకు రాజాసింగ్‌పై 101కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని.. 18 కమ్యూనల్ కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు.
ఇవీ సందేహాలు..
నిజానికి రాజాసింగ్‌పై ఇంత సీరియస్ యాక్షన్ తీసుకోవడంపై.. అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడో.. 101 కేసులు నమోదైనప్పుడు.. ఇప్పటి వరకుఏం చేశారు? అనేది ప్రశ్న. పైగా.. రౌడీ షీట్ ఓపెన్ చేయడం.. అందునా.. ప్రజాప్రతినిధిపై ఇప్పటికిప్పుడు..సాధ్యమేనా? ఇది కోర్టు పరిధిలో చట్టం ముందు నిలబడుతుందా? అనేది ప్రశ్న. పైగా.. ఇంతటి నిర్ణయాలు కూడా రాత్రికి రాత్రితీసుకున్నట్టుగా.. పరిశీలకులు.. అనుమానిస్తున్నారు మొత్తంగా ఈ కేసుల వెనుక.. ఖచ్చితంగా ఉప ఎన్నిక ఎఫెక్ట్ ఉండి ఉంటుందని.. అంటున్నారు.