దేశంలోని మరే రాజకీయ పార్టీకి లేని విచిత్రమైన.. విలక్షణమైన జెండా రంగు టీఆర్ఎస్ సొంతంగా చెప్పాలి. ముదురు గులాబీ (పాత రోజుల్లో అయితే పాల రోజాగా పిలిచేవారు) రంగుతో ఒక రాజకీయ పార్టీ జెండా అన్నది ఊహకు కూడా అందదు. కానీ.. అలాంటి ఊహకు అందని రీతిలో రియాక్ట్ కావటం.. నిర్ణయాలు తీసుకోవటంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా. గడిచిన కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాల మీద బోలెడంత ఆసక్తిని ప్రదర్శిస్తున్న గులాబీ బాస్.. ఎట్టకేలకు తన అభిలాషను అనధికారికంగా వెల్లడించటం తెలిసిందే.
జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న కేసీఆర్.. ఆ వేడుకను భారీగా అనే దాని కంటే అత్యంత భారీగా చేపట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో తాను జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సిన అవశ్యకతను ప్రజలకు వివరిస్తారని చెబుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నందుకు రాష్ట్ర సీఎం పదవిని మరెవరికీ ఇచ్చేస్తారన్న అభిప్రాయం రాకుండా ఉండటానికి ముందే తాను సీఎం పదవిని వదిలి పెట్టనని.. అట్టి పెట్టుకుంటానని చెప్పటం గమనార్హం.
మరి కొత్త పార్టీ జెండా ఎలా ఉంటుంది? ఎజెండా ఏమిటి? పేరు ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలుకొంత మేర వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. కేసీఆర్ జాతీయ పార్టీ జెండాలోనూ గులాబీ రంగు మిస్ అయ్యే ఛాన్సు లేదంటున్నారు. పేరు విషయానికి వస్తే భారతీయ రాష్ట్ర సమితిగా ఉండే వీలుందంటున్నారు. ఒకవేళ మరో పేరు ఉన్నా ఆశ్చర్యపోవాల్సి లేదంటున్నారు. కానీ.. తెలంగాణ అన్న పేరును మిస్ అయితే.. సొంత రాష్ట్రంలో నష్టం వాటిల్లుతుంది కదా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. దీనికి కేసీఆర్ ఏం చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
పార్టీ జెండాలో మాత్రం రంగు గులాబీనే ఉంటుందని.. కలిసి వచ్చిన రంగును ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదంటున్నారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్.. రైతు బంధు.. రైతుబీమాతోపాటు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అన్ని రకాల స్కీమ్ లను కూడా దేశ వ్యాప్తంగా ప్రవేశ పెడతామన్న మాట చెబుతారంటున్నారు. రైతులు.. దళితులు.. సైనికులు.. యువతతోపాటు మరికొన్ని వర్గాలకు పెద్ద పీట వేసేలా పార్టీ విధివిధానాలు ఉంటాయని చెబుతున్నారు.