రోజా…టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటి. సినిమాలకు గుడ్ బై చెప్పిన తర్వాత టీడీపీలో చేరి ఆ తర్వాత వైసీపీ ఫైర్ బ్రాండ్ మహిళా నేతగా, నగరి ఎమ్మెల్యేగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పొలిటిషియన్. పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ జగన్ కు తోడుగా ఉంటున్న రోజా….జగన్ తొలి మంత్రివర్గంలోనే చోటు ఆశించి భంగపడ్డారు. ఇక, రెండో సారైనా చాన్స్ దక్కుతుందేమోనన్న రోజాకు చివరి నిమిషం వరకు ఉత్కంఠ ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఎట్టకేలకు సస్పెన్స్ కు తెరదించుతూ అనూహ్యంగా రోజా పేరు తుది జాబితాలో చేరింది. ఈ క్రమంలోనే తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రోజా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమాలు, జబర్దస్త్ వంటి షోలలో నటించబోనని రోజా సంచలన ప్రకటన చేశారు. తాను మంత్రి పదవికి పూర్తి సమయం కేటాయించాల్సి ఉన్నందున షూటింగులకు సమయం కేటాయించలేనని తేల్చి చెప్పేశారు.
తనకు మంత్రి పదవి లభించినందుకు సంతోషంగా ఉందని, సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. తనకు మంత్రి పదవి ఇచ్చిన జగనన్నపై అభిమానం రెట్టింపయిందని చెప్పారు. తనకు ఏ శాఖ కేటాయించినా సమర్థవంతంగా పని చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రిగా సీఎంకు మంచి పేరు తీసుకొచ్చేలా బాధ్యతలను నిర్వర్తిస్తానని చెప్పారు. ప్రాణం ఉన్నంత వరకు జగనన్న కోసం పని చేస్తానన చెప్పారు.
సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికీ మర్చిపోలేనని, జగనన్న తనకు రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా అవకాశం ఇచ్చారని అన్నారు. మహిళా పక్షపాత సీఎం క్యాబినెట్లో మహిళ మంత్రిగా చోటు దక్కడం తన అదృష్టమని, సీఎం జగనన్న చెప్పిన పని చెయ్యడమే తన విధి అని చెప్పారు. కాగా, రోజాకు సుచరిత స్థానంలో హోం మంత్రి పదవి దక్కే అవకాశముందని జోరుగా ప్రచారం జరుగుతోంది.