ఒక్క చాన్స్ …ఒకే ఒక్క చాన్స్ అంటూ ఏపీ ప్రజలను జగన్ మాయ చేశారని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇపుడు అదే జనం…జగన్ కు మరో చాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేరని పలు సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఉమ్మడి ఏపీలోగానీ, నవ్యాంధ్రలోగానీ ఇంతటి చెత్త పాలన అందించిన సీఎం జగన్ ఒక్కరేనంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.
క్విట్ జగన్.. సేవ్ ఏపీ..అంటూ టీడీపీ ఏకంగా క్యాంపెయిన్ మొదలుబెట్టింది. ఇక, ఏపీని అప్పుల ఊబిలో నెట్టిన జగన్ పై జాతీయ మీడియాలోనూ పుటలుపుటలుగా కథనాలు వచ్చాయి. ఇలా జగన్ పై ఈ రేంజ్ లో వ్యతిరేకత, జగన్ పాలనపై విమర్శలు వస్తున్న తరుణంలో వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించక మానవు. జగన్ వ్యతిరేకించేవారంతా బ్లడీ ఫూల్స్ అంటూ నిండు సభలో రోజా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
అంతేకాదు, జగన్ ను వ్యతిరేకించేవారందరి బాక్సులు బద్దలైపోతాయంటూ అసభ్యకర పదజాలంతో ప్రసంగించారు రోజా. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి వారందరికీ పెద్ద గుణపాఠం చెబుదామంటూ ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రోజా చేసిన ఈ కామెంట్లు కాక రేపుతున్నాయి. ఇప్పటి వరకూ తెలుగు ప్రజలను పాలించిన 15 మంది ముఖ్యమంత్రుల చరిత్రల్ని తిరగరాస్తున్నది సీఎం జగన్ ఒక్కరేనంటూ ఆకాశానికెత్తేశారు రోజా.
జనసేన, వైసీపీ, టీడీపీ అనే తేడా లేకుండా అన్ని పార్టీ నేతలకు సంక్షేమ పథకాలందించిన ఘనత జగన్ సొంతమంటూ పొగడ్తలతో ముంచెత్తారు రోజా. అలాంటి గొప్ప వ్యక్తిని బలపరచాల్సిన అవసరం ఉందని, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి కుటుంబాన్ని గెలిపించి, గౌతమ్ రెడ్డికి ఘన నివాళి ఇవ్వాలని ప్రజలకు రోజా పిలుపునిచ్చారు. జగనన్నను కారు కూతలు కూసే ఆ బ్లడీ ఫూల్స్కు బాక్సులు బద్ధలయ్యేలా వైఎస్సార్ సీపీకి ఓట్లు వేసి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని గెలిపించాలని రోజా అన్నారు. తాజాగా రోజా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న టీవీ5 ఛానెల్ పై అనవసరంగా నోరు పారేసుకున్న రోజా…మరోసారి అడ్డగోలుగా మాట్లాడి మంత్రి పదవికి ఉన్న వన్నె తగ్గిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.