ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల అడుగు పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రేపోమాపో షర్మిల ఏపీ కాంగ్రెస్ లో చేరబోతున్నారని, ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఆమెకు బాధ్యతలు కట్టబెట్టబోతున్నారని పుకార్లు వస్తున్నాయి. ఈ విషయంపై ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ హై కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మంత్రి రోజా స్పందించారు. ఏపీ పాలిటిక్స్ లోకి షర్మిల ఎంట్రీపై రోజాను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా దానికి ఆమె ఆసక్తికర సమాధానమిచ్చారు. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తే మీకేమైనా ఇబ్బందా అంటూ ఆ విలేకరిని రోజా తిరిగి ప్రశ్నించారు. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రావడం వల్ల తనకేమీ ఇబ్బంది లేదని రోజా క్లారిటీనిచ్చారు.
ఇటువంటి అంశాల గురించి తన అభిప్రాయాన్ని గతంలోనూ అనేక సందర్భాల్లో వెల్లడించాలని రోజా అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చని, పాదయాత్రలు చేయవచ్చని అన్నారు. అయితే, వారి ఎజెండా నమ్మశక్యంగా ఉన్నప్పుడే ప్రజలు వారికి అండగా నిలుస్తారని చెప్పారు. ఎవరో వస్తారు…ఏదో చేస్తారు అని భయపడే క్యారెక్టర్ జగన్ ది కాదని, ఈ విషయం ఇప్పటికే అందరికీ అర్థమై ఉంటుందని అన్నారు.
ఇక, ఇదే విషయంపై ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ కూడా స్పందించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరే విషయం గురించి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. దివంగత కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురిగా షర్మిల అంటే గౌరవం ఉందన్నారు. షర్మిల పార్టీలో చేరిక, ఆమెకు అప్పగించే బాధ్యతల గురించి పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతు పలికిన సంగతి తెలిసిందే.