తెలుగువారి ఆత్మబంధువు నందమూరి తారక రామరావు శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిధిగా హాజరైన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఏపీ మీదా.. చంద్రబాబు మీదా.. ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధం గురించి చెప్పటం తెలిసిందే. రాజకీయాల గురించి మాట్లాడొద్దని తన అనుభవం చెబుతుందని.. కానీ చంద్రబాబు ఉన్న సభలో కాస్తంత రాజకీయాలు మాట్లాడకపోతే ఎలా అంటూ మాట్లాడిన రజనీకాంత్ వ్యాఖ్యలపై తాజాగా ఏపీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు.
‘‘రజనీకాంత్ కు తెలుగు రాష్ట్రం మీదా.. రాజకీయాల మీదా అవగాహన లేదన్న విమర్శలు చేశారు. రజనీకాంత్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధ పడుతుంది’’ అన్న రోజా.. రజనీకాంత్ తో చంద్రబాబు అబద్ధాలు చెప్పించారన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు ఎంత చెబితే మాత్రం రజనీకాంత్ చెప్పేస్తారా? ఆ మాటకు వస్తే.. రజనీకాంత్ కు ఇబ్బందిగా ఉంటే.. అసలు కార్యక్రమానికే డుమ్మా కొట్టేసేవారు కదా? అన్నది ప్రశ్న. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు వచ్చిన సందర్భంగా మాట్లాడిన మాటలకు ఇంత భారీగా కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? అన్నది ఇప్పుడు చర్చగా మారింది.
ఎందుకంటే.. రజనీకాంత్ కేవలం రాజకీయాల్ని మాత్రమేమాట్లాడలేదు. ఆ మాటకు వస్తే.. ఎన్టీఆర్ తన జీవితం మీద చూపిన ప్రభావం.. ఆయన తన జీవితంలో ఎంతటి కీలకమైన వ్యక్తి అన్న విషయాన్ని చెప్పేందుకు చాలానే విషయాల్ని చెప్పారు. ఈ క్రమంలోనే చంద్రబాబు.. ఆయన విజన్ గురించి మాట్లాడారన్నది మర్చిపోకూడదు. చంద్రబాబు లేనప్పుడే హైదరాబాద్ డెవలప్ అయ్యిందంటూ ఆర్కే రోజా మాటల్ని చూసినప్పుడు.. రాజకీయ వ్యాఖ్యల్లోని డొల్లతనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి.
చంద్రబాబు విజన్ 2047 గురించి రజనీకాంత్ ప్రస్తావించిన వైనంపై రోజా మాట్లాడుతూ.. ఆ సమయానికి చంద్రబాబు ఏ దశలో ఉంటారో రజనీకాంత్ కు తెలుసా? అంటూ రోజా చేసిన వ్యాఖ్యను చూసినప్పుడు.. ఆమెకున్న రాజకీయ పరిపక్వత ఎంతన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఎన్టీఆర్ పేరుతో చంద్రబాబును.. టీడీపీని తిట్టే క్రమంలో భారతరత్న అంశాన్ని ప్రస్తావించే రోజా.. ఈసారి దాన్ని మిస్ కాకుండా ప్రస్తావించారు. ఇన్ని చెప్పిన రోజా.. గడిచిన నాలుగేళ్లలో ఎన్టీఆర్ కు భారతరత్నను ప్రకటించేలా మోడీ సర్కారును ఒప్పించి ఉంటే.. ఆ క్రెడిట్ వైసీపీకే దక్కేది కదా? రోజా మాటలు ఎంతో అర్థవంతంగా ఉండేవి. మరి.. అలాంటి పనులు జరిగేలా ఎందుకుచూడటం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.