మాట్లాడటం తప్పు కాదు. కానీ.. ఒకరి తప్పు ఎత్తి చూపే ముందు.. తాము మాట్లాడుతున్న మాటల్లో తప్పులు దొర్లకుండా చూసుకోవాల్సిన అవసరం రాజకీయ నేతలకు ఉంటుంది. అందునా ప్రభుత్వంలో మంత్రి స్థానంలో ఉన్న వారికి మరింత బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వారు చేసే వ్యాఖ్యల కారణంగా మైలేజీ ప్రభుత్వానికి వరంగా.. అదే సమయంలో వారు చేసే వ్యాఖ్యల్లో దొర్లే తప్పులు సర్కారుకు శాపంగా మారతాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైన ఫైర్ అయ్యేందుకు మంత్రి ఆర్కే రోజా చూపించే దూకుడు అంతా ఇంతా కాదు.
పవన్ ను విమర్శించకూడదు.. తిట్టకూడదన్న రూలేం లేదు కానీ.. ఆ పేరుతో నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. రాజమహేంద్రవరం జైలు బయట.. రాబోయే ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేస్తామంటూ పొత్తులపై క్లారిటీ ఇచ్చేసిన పవన్ తీరును రోజా తీవ్రస్థాయిలో తప్పు పట్టారు. ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలో ఆమె లాజిక్కులు మిస్ అయ్యారు. నోటికి ఎంత వస్తే అంతన్న రీతిలో ఆమె చెలరేగిపోయారు. తనను దత్తపుత్రుడు.. ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతోకొడతానన్న పవన్ ను ఇప్పుడేమంటారు? అంటూ సంబంధం లేని పోలికను తీసుకొచ్చిన ఆమె.. తన చెప్పుతో తాను కొట్టుకుంటాడా? లేదంటే జైల్లో ములాఖత్ అయిన పెద్దమనిషి చంద్రబాబును కొడతాడా? అంటూ మండిపడ్డారు.
ప్యాకేజీ స్టార్.. దత్తపుత్రుడు అన్న మాటలకు అర్థం గురించి రోజాకు ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. అయితే.. పవన్ ను ఆ రెండు మాటలు అనటానికి ముందు.. తాము అన్న మాటలకు సంబంధించి ఆధారాల్ని చూపించాల్సిన అవసరం ఉంది. ప్యాకేజీ స్టార్ అని అదే పనిగా పవన్ ను ఆడిపోసుకోవటానికి ముందు.. ఆయన ఆస్తుల చిట్టాను చూపించి అభ్యంతరాల్ని చెబితే బాగుంటుంది. అదేమీ లేకుండా.. ప్యాకేజీ స్టార్.. ప్యాకేజీ స్టార్ అనేస్తే ఎలా? లాజిక్ లేని విమర్శలకు.. ఆధారాలు లేని ఆరోపణలకు విలువ ఉండదన్న చిన్న విషయాన్ని రోజా ఎలా మిస్ అవుతారు?
ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీతో చర్చించకుండానే చివరకు జనసేనలో పెద్ద నేతలుగా చెప్పుకునే నాదెండ్ల మనోహర్.. నాగబాబుకు చెప్పకుండానే పవన్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడన్న రోజా మాటలపై విస్మయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎన్ని విషయాలు మంత్రివర్గానికి చెప్పి నిర్ణయం తీసుకుంటున్నారు? చంద్రబాబు అరెస్టుకు సంబంధించి పార్టీ వారితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నారా?
బాబు పేరు మీద ఫైల్ అయిన స్కిల్ స్కాం విచారణ విషయాన్ని జగన్ ప్రభుత్వం ఎంతమంది మంత్రులకు సమాచారం ఇచ్చి విచారణ చేయించింది? అంతెందుకు? తన ఢిల్లీ పర్యటనల సందర్భంగా చోటుచేసుకునే అంశాల్ని మంత్రుల్లో ఎంతమందికి వివరంగా సీఎం జగన్ చెప్పారా? లాంటి ప్రశ్నలకు రోజా ఏమని బదులిస్తారు?
పవన్ తన సినిమాల్లో నాకు కొంచెం తిక్కుంది.. దానికి లెక్కుంది అని పవన్ అంటారని.. ఆయన తిక్క జనసైనికులు.. లెక్క ప్యాకేజీ అని ఎద్దేవా చేసిన రోజా.. మాటలే తప్పించి చేతల్లో అందుకు తగ్గ ఆధారాలు చూపించకపోవటాన్ని తప్పు పడుతున్నారు.
అదే పనిగా ఒకరిపై ఆరోపణలు చేసే ముందు.. కనీస మర్యాదల్ని పాటించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మర్చిపోవటాన్ని తప్పు పడుతున్నారు. ఎంత ఫ్లోలో అయితే మాత్రం ‘‘వాడు’’.. ‘‘వీడు’’ లాంటి మాటలు మర్యాద కాదన్న విషయాన్ని మంత్రి రోజా ఎలా మర్చిపోతున్నట్లు? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.