వైసీపీలో అంతర్గత కుమ్ములాటలకు కొదవ లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. వాస్తవానికి ప్రత్యర్థి పార్టీల నేతలపై యుద్ధం చేయాలని వైసీపీ అధినేత సీఎం జగన్ పిలుపునిస్తున్నారు. కానీ, దీనికి భిన్నంగా వైసీపీ నాయకులే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం.. అవకాశం చిక్కితే ఎదురుదాడులు చేసుకోవడం చాలా నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా మంత్రి రోజాకు వైసీపీ నుంచి ఎదురుగాలి వీస్తోంది. గత ఏడాది ప్రారంభంలోజరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రోజా దూకుడుగా వ్యవహరించడంతో శ్రీశైలం ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు శిల్పా చక్రపాణి రెడ్డి వర్గం మైనస్‌లో పడిపోయింది.
ఇక, అప్పటి నుంచి కూడా రోజా వర్సెస్ శిల్పా అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి. వాస్తవానికి శ్రీశైలం నియోజకవర్గాని కి, రోజా నియోజకవర్గానికి(నగరి) సంబంధం లేదు. అయినప్పటికీ.. రోజాను ఓడించి తీరుతానంటూ.. చక్రపాణి రెడ్డి గతంలో ప్రతిజ్ఞ చేశారు. అదేసమయంలో రోజా కూడా ఎవరూ తనను ఓడించే వారు లేరని.. తనను ఓడించే వారుపుట్టలేదని ఫైర్ అయ్యారు. ఈ సెగలు పొగలు.. కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలావుంటే, నగరిలో రోజాకు వ్యతిరేకంగా రెండు రోజులుగా బ్యానర్లు వెలుస్తున్నాయి. రోజా ఏం చేశారని ఓటేయాలి? అంటూ..బ్యానర్లు దర్శనమిస్తుండడంతో ఆమె వర్గం సంశయంలో పడింది.
ఇక, మరోవైపు.. శ్రీశైలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిల్పాకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచుతున్నారు. తాజాగా శిల్పా చక్రపాణి రెడ్డి గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లిన సమయంలో కుప్పలు కుప్పలుగా ఈ కరపత్రాలు కనిపించాయి. దీంతో ఆయన సీరియస్ అయ్యారు. దీని వెనుక ఎవరున్నారో తనకు తెలుసునంటూ..ఆయన పరోక్షంగా మంత్రి రోజాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మరోవైపు..నగరిలో రోజాకు వ్యతిరేకంగా కట్టిన బ్యానర్ల వ్యవహారం తాడేపల్లి వరకు చేరుకుంది. ఈ విషయంలో నిజానిజాలు బయటకు వచ్చేలా చేయాలని సీఎం జగన్‌ను రోజా తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలోనే అభ్యర్థించడం గమనార్హం.
అయితే.. ఎవరినీ ఏమీ అనని సీఎం జగన్.. త్వరలోనే అన్ని విషయాలు తేలుతాయంటూ.. అనునయించారు. ఈ విషయాన్ని పరిశీలించాలంటూ.. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సూచించారు. ఇక, శిల్పా వర్సెస్ రోజాల మధ్య జరుగుతున్న పోరుపై ఇప్పటికే ఒకసారి పంచాయితీ జరిగిన నేపథ్యంలో ఎన్నికలకు ముందు రెండు కీలక నియోజకవర్గాల్లో ఒకరిపై ఒకరు ఆధిపత్య రాజకీయాలు చేయడం పార్టీలో చర్చకు దారితీసింది. మొత్తానికి ఈ వివాదం ఇప్పట్లో ముగుస్తుందో.. ఎన్నికల వరకు సాగుతుందో చూడాలని అంటున్నారు వైసీపీ సీనియర్లు.