వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని బూతుల భాషపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, వారి తనయుడు లోకేష్ లపై కొడాలి నాని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా చేపట్టారు. కొడాలి నానిపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కానీ, నానిపై ఇప్పటిదాకా కేసు నమోదు కాలేదు.
మంత్రి కొడాలి నాని హద్దులు మీరు మాట్లాడుతున్నారని, వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను దూషిస్తే సహించేది లేదని టిడీపీ నేతలు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక, కొడాలి నాని భాషపై టీడీపీ నేతలే కాదు వామపక్ష పార్టీలు, జనసేన నేతలు కూడా మండిపడుతున్నారు. ఇటువంటి తరుణంలో కూడా కొడాలి నాని భాషకు వైసీపీ మహిళా నేత, మంత్రి రోజా మద్దతు పలకడం సంచలనంగా మారింది.
తొలిరోజు అసెంబ్లీ సమావేశాలు పది నిమిషాల పాటు వాయిదా పడ్డాయి. ఈ గ్యాప్ లో మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి మైక్ అందుకున్న రోజా..మరే టాపిక్ లేనట్లుగా కొడాలి నాని వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తూ స్టేట్ మెంట్ ఇచ్చారు. కొడాలి నాని భాషలో తప్పేముంది అని రోజా ఎదురు ప్రశ్నిస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. కొడాలి నాని బూతులకు మద్దతు తెలిపిన మంత్రి రోజాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి .
అంతేకాదు, కొడాలి నానిపై ఈగ వాలినా సహించబోమంటు రోజా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక, టీడీపీ నేతలు అంతా కలిసినా కొడాలి నాని గడ్డంలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరంటూ కొడాలి నానికన్నా అసభ్యకరంగా మాట్లాడారు రోజా. దీంతో, రోజా తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మహిళ అయి ఉండి, అందులోనూ బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి, కొడాలి నాని భాషను ఖండించాల్సిన రోజా ఆయన కన్నా దిగజారి మాట్లాడడం ఏమిటని నెటిజన్లు నిలదీస్తున్నారు.
తమ పార్టీకి చెందిన శాసనసభ్యుల భాషను సరి చేయాల్సింది పోయి ఆయన మరింత రెచ్చిపోయేలా ఆ వ్యాఖ్యలను సమర్థించడం ఏమిటని మండిపడుతున్నారు. ఇప్పటిదాకా బూతులు మంత్రిగా కేవలం కొడాలి నానికే పేరుందని, కానీ, తాజాగా కొడాలి నానికి సపోర్ట్ చేసిన ‘జబర్దస్త్’ రోజా కూడా బూతుల మంత్రుల జాబితాలో చేరిపోయారని విమర్శిస్తున్నారు. బూతుల మంత్రి కొడాలి నానికి మద్దతు పలుకుతున్న మంత్రి రోజా రాష్ట్రంలోని మహిళలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.