వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మంత్రి రోజా.. తాజాగా చేసిన వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా స్పందిస్తున్నారు. ఎవరికైనా వైఎస్ దిక్కు కదా.. రోజమ్మా.. ఇందులో షర్మిల చేసిందేముంది? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. ఐదేళ్ల పాలన తర్వాత.. 2.63 లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు పంచామని చెబుతున్న తర్వాత కూడా.. ఆయన ఫొటో పెట్టుకునే ఎన్నికలకు వెళ్తున్నారు కదమ్మా! అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో రోజా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.
రోజా ఏమన్నారంటే..
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ జూబ్లీ గ్రౌండ్లో జరుగుతున్న `ఆడుదాo ఆంధ్ర `..కబడ్డీ పోటీలను మంత్రి రోజా వీక్షించడంతో పాటు కబడ్డీ ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. “తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనం చేసి.. ఇప్పుడు ఏపీలో టైమ్ పాస్ రాజకీయాలు చేయడానికి షర్మిల వచ్చింది. షర్మిల మాట్లాడే ప్రతి మాట కూడా చంద్రబాబు స్క్రిప్ట్ “ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. వినే వాడు వెర్రి వాడు అయితే చెప్పే వాడు షర్మిల అన్నట్లుగా పరిస్థితి మారిందన్నారు.
“ఒక్క రాజశేఖర్ రెడ్డి బిడ్డ అనే గుర్తింపు తప్ప.. అసలు షర్మిలకు అసలేం గుర్తింపు ఉంది“ అని రోజా ప్రశ్నించారు. అదేసమయంలో వైఎస్ ఫొటో తీసేస్తే.. షర్మిల ఎవరని ప్రతి ఒక్కరూ అడుగుతారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైనే నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు. మీరు కూడా.. వైఎస్ ఫొటో తీసేసి ఎన్నికలకు వెళ్లొచ్చుకదా? అని అడుగుతున్నారు. అంతేకాదు.. ఎవరికైనా.. ఇప్పుడు వైఎస్ దిక్కేనని.. ఆయన ఫొటో.. ఆయన బిడ్డ అనే సెంటిమెంటు డైలాగులే.. నమ్ముకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. అంత మాత్రానికి ఎందుకు ఇలా వ్యాఖ్యానించడం ? అని ప్రశ్నిస్తున్నారు.