మంత్రి రోజాకు దిక్కుతోస్తున్నట్లు లేదు. రాబోయే ఎన్నికల్లో నగిరిలో పోటీచేస్తారో లేదో కూడా క్లారిటి ఉండటంలేదు. నగిరిలో రోజాయే పోటీచేస్తుందని ఇప్పటివరకు పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. పోని ఇంకెవరినైనా అభ్యర్ధిగా ప్రకటించిందా అంటే అదీలేదు. మరలాంటపుడు రోజానే కదా అభ్యర్ధి అని అనుకోవచ్చు. అయితే ఒంగోలు ఎంపీగా రోజా పేరును జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్నట్లు ప్రచారం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో తాను పోటీచేస్తానని ఒకసారి, జగనన్న ఏమి చెబితే దాని ప్రకారం నడుచుంటానని మరోసారి రోజాయే చెబుతున్నారు.
దాంతోనే నగిరిలో రోజా పోటిచేసేది అనుమానమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉంటే రాజాకు టికెట్ ఇస్తే ఓడిపోవటం ఖాయమని, తాము రోజాకు పనిచేసేది లేదని కొందరు నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. రోజాకు నియోజకవర్గంలో బలమైన వ్యతిరేకవర్గం చాలాకాలం క్రితమే తయారైంది. శ్రీశలం ట్రస్టుబోర్డు ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ దంపతులు కేజే శాంతి, కేజే కుమార్, వడమాలపేట జడ్పీటీసీ మురళీధరరెడ్డి లాంటి మరో ఇద్దరు రోజాకు వ్యతిరేకంగా చేతులు కలిపారు.
రోజాకు కాకుండా ఇంకెవరికి టికెట్ ఇచ్చినా తాముంతా కలిసి పనిచేసి అభ్యర్ధిని గెలిపిస్తామని డైరెక్టుగా జగన్ కే చెప్పారు. దాంతో రోజాకు నియోజకవర్గంలో కుంపట్లు మొదలైపోయాయి. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మొదటినుండి బాగా దూకుడు మనస్తత్వం ఉన్న రోజా కు ఇప్పటి వ్యతిరేకులంతా ఒకపుడు బాగా సన్నిహితులే. అయితే వాళ్ళమధ్య ఏమి గొడవలయ్యాయో తెలీదు కాని ఇపుడు మాత్రం బద్ద వ్యతిరేకంగా తయారయ్యారు.
ఒకవేళ రోజాకే జగన్ టికెట్ ప్రకటిస్తే పరిస్ధితులు ఎలాగుంటాయో ఎవరు అంచనా వేయటంలేదు. ప్రత్యక్షంగా జగనే రంగంలోకి దిగి మంత్రి వ్యతిరేకులతో మాట్లాడి సర్దుబాటు చేస్తేకాని రోజాకు వాళ్ళు పనిచేస్తారో లేదో తెలీదు. అలా కాకుండా రోజాకు జగన్ టికెట్ ఇచ్చేసి ఎవరితోను మాట్లాడకపోతే మాత్రం రోజా గెలుపు అనుమానమనే చెప్పాలి. అంటే రోజా గెలుపోటములు స్వయంగా జగన్ చేతిలోనే ఉన్నాయని అర్ధమైపోతోంది. మరి చివరకు ఏమి జరగుతుందో చూడాలి.