దేశంలో రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు, అమలు చేస్తున్న ఉచిత పథకాలపై దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొద్ది రోజుల క్రితం కీలకమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఉచిత పథకాల ఎర వేస్తున్న రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని, అలా చేసే పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసి ఎన్నికల గుర్తును సీజ్ చేయాలని దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఉచిత హామీలు, పథకాలను ఆయా పార్టీలు నియంత్రించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది.ఈ విషయంలో ఎన్నికల సంఘం ఏమీ చేయలేదా? అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఉచితాల పంపిణీ, వాగ్దానాలను సుప్రీంకోర్టు తీవ్రమైన సమస్యగా పేర్కొంది ఈ ఉచితాల కారణంగా ఆర్థిక వ్యవస్థ నష్టపోతోందని, అదే విధంగా ప్రజల సంక్షేమం సమతుల్యంగా ఉండాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే సీజేఐ ఎన్వీ రమణపై రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పొందుతున్న ఉచితాలేంటో చెప్పాలని జయంత్ చౌదరి డిమాండ్ చేశారు. కోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా సాహసోపేతంగా కనిపిస్తున్నాయని, కానీ, అవి సరైన స్ఫూర్తితో లేవని జయంత్ చౌదరి షాకింగ్ కామెంట్లు చేశారు.
దేశంలో అట్టడుగు వర్గాల ప్రజలకు రేషన్, ఆర్థిక సహాయం అందించేందుకు ప్రత్యక్ష జోక్యం అవసరమని జయంత్ అభిప్రాయపడ్డారు. ఇది ప్రాథమిక హక్కుల్లో జీవించే హక్కును కాపాడడం కిందకే వస్తుందని అన్నారు. ఎన్నికల సమయంలో చాలా ఉచిత వాగ్దానాలు మేనిఫెస్టోలో భాగం కావని కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను కూడా జయంత్ తిప్పికొట్టారు. బీజేపీపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు.