దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కోర్టులో కేసు వేయబోతున్నట్లు ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ ప్రకటించారు. కౌంటింగ్ సమయంలో చాలా చోట్ల పోలింగ్ అధికారులు భాజపాకు అనుకూలంగా వ్యవహరించినట్లు తీవ్రంగా మండిపడ్డారు. పోస్టల్ బ్యాలెట్లను ముందు లెక్కించాల్సుంటే చివరలో లెక్కించినట్లు ఆరోపించారు. ఇక చాలా చోట్ల 900కి పైగా పోస్టల్ బ్యాలెట్లను చెల్లనివిగా ఏకపక్షంగా అధికారులు ప్రకటించారట.
మహాకూటమి-ఎన్డీయేకి మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 12,270 మాత్రమే అని తేజస్వి చేసిన ప్రకటన ఆసక్తిగా ఉంది. చాలా తక్కువ ఓట్లతోనే 20 సీట్లను మహాకూటమి అభ్యర్ధులు ఓడిపోయినట్లు చెప్పారు. ఈ స్ధానాల్లో పోస్టల్ బ్యాలెట్లే చాలా కీలకంగా మారినట్లు తేజస్వీ చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. ఓట్ల లెక్కింపు సవ్యంగా జరిగితే తమ కూటమి 130 సీట్లకు పైగా గెలుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అవకతవకలు, ఓట్ల కౌంటింగ్ సమయంలో జరిగిన అక్రమాలపై ఎన్నికల కమీషన్ కు వెంటనే లేఖ రాయబోతున్నట్లు తేజస్వీ చెప్పారు. ఒకవేళ ఎన్నికల కమీషన్ నుండి స్పందన కనబకపోతే వెంటనే కోర్టులో కేసు కూడా వేస్తామంటున్నారు. సరే తనకున్న అనుమానాలతో కోర్టులో కేసు వేయటం తేజస్వి చేతిలోని పనే కాబట్టి కేసు వేయటం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కోర్టు ఈ వివాదాన్ని ఎంత కాలంలో పరిష్కరిస్తుందన్నదే సమస్య.
ఎందుకంటే ఎక్కడైనా నియోజకవర్గంలో అవకతవకలు జరిగిందనో లేకపోతే గెలిచిన అభ్యర్ధిపై ఓడిన అభ్యర్ధి కోర్టులో కేసు వేస్తుంటే ఏమవుతోంది. మళ్ళీ ఎన్నికలు వచ్చేనాటికి తీర్పు వస్తోంది. కొన్నిసార్లయితే తర్వాత ఎన్నికలు జరిగిపోయినా అంటే కేసు వేసి ఐదేళ్ళు దాటిపోయినా కూడా కోర్టులో కేసులు తెమలటం లేదు. ఇటువంటి నేపధ్యంలో ఏకంగా ప్రభుత్వం ఏర్పాటుపైనే కోర్టులో కేసంటే ఎప్పటికి విచారణ జరిగేను ? ఎప్పటికి తీర్పొచ్చేనో ?