కోససీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా మార్చడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. జిల్లా పేరు మార్చొద్దని, పాత పేరే ఉంచాలని ఓ వర్గం ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే అమలాపురంలో హింసాత్మక ఘటనలు జరిగగాయి. ఏపీ మంత్రి పినిపె విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఆందోళనకారులు దాడి చేయకముందే విశ్వరూప్ కుటుంబ సభ్యులు ఇంటినుంచి వెళ్లిపోవడంతో ప్రమాదం తప్పింది.
మంత్రి ఇంటి ఫర్నిచర్ ను, ఇంటి అద్దాలను ధ్వంసం చేసిన ఆందోళనకారులు, మంత్రి ఇంటి ఎదుట ఉన్న ఎస్కార్ట్ వాహనంతో పాటు ఇంట్లో ఉన్న మూడు కార్లను ఓ బైక్ ను దగ్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ బాబు ఇంటికి కూడా నిరసనకారులు నిప్పంటించారు. నిరసన జరుగుతుందని తెలిసినప్పటికీ…ఈ స్థాయిలో హింసాత్మకంగా మారుతుందని అంచనా వేయడంలో పోలీసులు, ఇంటెలిజెన్స్ విఫలమయ్యాయని తెలుస్తోంది.
అంతకుముందు, అమలాపురంలోని గడియారం స్తంభం సెంటర్, ముమ్మిడివరం గేట్ తదితర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే, దాదాపు 5 వేల మంది ఆందోళనకారులు వస్తారని ఊహించని పోలీసులు ఖంగుతిన్నారు. దీంతో, అమలాపురం ఏరియా ఆసుపత్రి వద్ద పోలీసులపై ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పోలీసులకు, యువకులకు ఇరువర్గాలకు గాయాలయ్యాయి. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి త్రుటిలో రాళ్ల దాడి నుంచి తప్పించుకోగా, డీఎస్పీ ఒకరు సొమ్మసిల్లి పడిపోయారు. ఎస్పీ వాహనంపై రాళ్లు రువ్విన ఘటనలో ఎస్పీ గన్ మెన్ కు గాయాలయ్యాయి.
పక్కాగా ముందస్తు ప్రణాళిక ప్రకారమే అమలాపురంలో మంత్రి, ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టడం, హింసాత్మక ఘటనలను ప్రేరేపించడం వంటివి జరిగాయని తెలుస్తోంది. జిల్లాలోకి బయటి వ్యక్తులు, అసాంఘిక శక్తులు వచ్చాయని అనుమానిస్తున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం అమలాపురంలో 144 సెక్షన్ విధించారు. మరిన్ని పోలీసు, పారా మిలటరీ బలగాలను రంగంలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.