తెలంగాణలో కొంతకాలంగా టీఆర్ఎస్ నేతలకు, తీన్మార్ మల్లన్నకు మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ పై, టీఆర్ఎస్ నేతలపై మల్లన్న చేసిన సెటైరికల్ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఇక, పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసిన మల్లన్నకు మంచి మద్దతు లభించింది. ఈ క్రమంలోనే తాజాగా మల్లన్నకు చెందిన క్యూ-న్యూస్ యూట్యూబ్ చానెల్ కార్యాలయంపై హైదరాబాద్ సీసీఎస్ సైబర్‌క్రైమ్స్ పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. తీన్మార్ మల్లన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఆఫీసులోని కంప్యూటర్లను, హార్డ్ డిస్క్‌లను పోలీసులు సీజ్ చేశారు. తీన్మార్ మల్లన్నపై ఓ యువతి ఫిర్యాదు నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించారని అంటున్నారు. చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో మల్లన్నపై మరో కేసు నమోదుకావడంతో మల్లన్నకు 41ఏ నోటీసులు అందజేశారు. క్యూ-న్యూస్‌లో బ్యూరోచీఫ్‌గా పనిచేసిన చిలుక ప్రవీణ్…. మల్లన్నపై తీవ్ర ఆరోపణలు చేశారు. దానికి కౌంటర్ గా ప్రవీణ్ పై మల్లన్న ప్రత్యారోపణలు చేశారు.
ప్రవీణ్‌తో కలసి ఉన్న కొందరు యువతుల ఫొటోలు, వీడియోలను మల్లన్న ప్రదర్శిస్తూ అభ్యంతరకరంగా వ్యాఖ్యానించారు. ఆఫొటోలలో ప్రియాంక అనే యువతి ఫొటోలు కూడా ఉన్నాయి. దీంతో, ఆమె సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ప్రవీణ్ స్నేహితురాలినని.. స్నేహపూర్వకంగా దిగిన ఫొటోలను చూపిస్తూ మల్లన్న అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు తీవ్ర మనోవేదనకు గురయ్యానంటూ ప్రియాంక ఫిర్యాదు చేశారు.
మల్లన్నకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆ యువతి పోలీసులకు అందించడంతో ఈ ఫిర్యాదు ఆధారంగా సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. సోదాలకు సంబంధించిన వివరాలు చెప్పడానికి సైబర్‌క్రైమ్స్ పోలీసులు నిరాకరించారు. సోదాల నేపథ్యంలో పోలీసులకు, మల్లన్న అభిమానులకు మధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. సోదాల సమయంలో ఇతరులను లోపలికి అనుమతించలేదని తెలుస్తోంది.