అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాభవం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నీరసించిపోయిన సంగతి తెలిసిందే. అధికారపక్షానికి కొరుకుడుపడని రీతిలో వ్యవహరించాల్సిన స్థానే.. చేష్టలుడిగిపోయినట్లుగా ఉన్నట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తున్న పరిస్థితి. ఇలాంటివేళ.. ఇటీవల కాలంలో యాక్టివ్ గా మారిపోయారు కాంగ్రెస్ నేతలు. వీరికి జత కలిసినట్లుగా రాష్ట్ర పార్టీకి కొత్త ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న మాణిక్యం ఠాగూర్ తోడు కావటం టీ కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం మరింత పెరిగినట్లుగా కనిపిస్తోంది.
త్వరలో వస్తున్న వరుస ఎన్నికలతో జోష్ తో ఉన్న కాంగ్రెస్ నేతలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎలాంటి ఆస్తులు లేని కేసీఆర్.. సీఎం అయ్యాక మాత్రం అత్యధిక సంపన్నుడయ్యారన్నారు.
కేసీఆర్ మీద అవినీతి ఆరోపణలు.. ఆయన ఆస్తి మీద ఇప్పటివరకు పెద్దగా ఆరోపణలు చేయని కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు రూటు మార్చినట్లుగా కనిపిస్తోంది.
రానున్న ఐదేళ్లలో దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీని కేసీఆర్ మించిపోతారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ జోస్యం చెప్పారు. కాళేశ్వరం.. మిషన్ భగీరథ పనుల్లో ధరలు పెంచిన కేసీఆర్ వేలాది కోట్లు సంపాదించారని చెప్పారు.
ఇప్పటివరకు చేస్తున్న విమర్శలకు భిన్నంగా కేసీఆర్ ఆస్తులు.. ఆయన సంపదపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టిన వైనం రానున్న రోజుల్లో రాజకీయంగా మరింత వేడెక్కేలా చేస్తుందని చెప్పక తప్పదు.