ఆర్జీవీ అంటేనే సంచలనం. సినిమాలు చేసినా, చేయకపోయినా ఒక్క ట్వీట్ తో తన జీవితాన్ని ప్రభావితం చేసే వారి గురించి చెప్పగలరు. అదే ట్వీట్ ఇతరుల జీవితాన్నీ క్షణాల్లో మార్చగలరు కూడా ! దటీజ్ ఆర్జీవీ ! తాజాగా మైనర్ బాలిక రేప్ (సామూహిక బలాత్కారం అని రాయాలి) సంబంధించి చాలా వార్తలూ, వివరణలూ వస్తున్నాయి. కానీ ఆర్జీవీ మాత్రం తనదైన స్టైల్ కు కాస్త భిన్నంగా స్పందించారు.
ఈ విషయమై రఘునందన్ రావు (దుబ్బాక ఎమ్మెల్యే) కు పూర్తి మద్దతుగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. వాస్తవానికి ఈ కేసులో టీఆర్ఎస్,ఎంఐఎం పెద్దలు ఉండడంతో ఏం చెప్పాలో తేల్చుకోలేక పోలీసులు కొద్ది రోజులుగా సతమతం అవుతున్నారు. ఆధారాలతో సహా రఘునందన్ మాట్లాడుతున్నా కూడా కొన్ని విషయాల్లో పోలీసుల తరఫు నుంచి క్లారిటీ అన్నది మిస్ అవుతూనే ఉంది. ఈ కేసులో మైనర్లు కూడా ఉండడంతో ఏం చెప్పాలో కూడా ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు.
ఇప్పటిదాకా కేసు పురోగతి మొత్తం రఘునందన్ చెప్పిన లేదా విడుదల చేసిన వివరాల మేరకే ఉందీ అన్నది ఓ వాస్తవం. దీంతో ఆయనకు సోషల్ మీడియాలోనే కాదు ఆర్జీవీ సపోర్ట్ కూడా వచ్చింది. ఒక్కడిగా ఉంటూ ఆయన చేస్తున్న పోరాటంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తుంటే, ఈ కేసులో రఘునందన్ చెప్పింది సబబు అని తనకు అనిపిస్తుందని ఓ ఆసక్తిదాయక వ్యాఖ్య ఆర్జీవీ చేసి అధికారిక పార్టీలను వారి అనుచరులను ఇరకాటంలో పెట్టారు.
ఓ విధంగా రఘునందన్-ది సాహసం అయితే ఆర్జీవిది కూడా సాహసమే! ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీలపై పెద్దగా మాట్లాడేందుకు, వారికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చేందుకు సినిమా ప్రముఖులు ఆసక్తి చూపించరు.
కానీ ఈ విజయవాడ ఆర్జీవీ మాత్రం తెలంగాణ ఇష్యూస్ పై బాగానే లోతుగానే అధ్యయనం చేసి మరీ! మాట్లాడుతున్నారే అని ఓ ప్రశంస కూడా వస్తోంది. మరోవైపు రఘు నందన్ కూడా ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుకు సంబంధించిన వీడియోలు ఆధారాలు ఉన్నాయని, అవసరం అయితే వాటినీ దర్యాప్తు బృందాలకు ఇస్తానని అంటున్నారు. తనకు ఏ నిబంధనల మేరకు నోటీసులు ఇచ్చినా వాటిపై సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగానే ఉన్నానని అంటున్నారు రఘునందన్ !
ఇదే సందర్భంలో కేసుకు సంబంధించి ఆర్జీవీ చెబుతున్న మాటలు పూర్తిగా రఘునందన్ కు అనుకూలంగా ఉన్నాయి.. ఇవే ఇప్పుడు నెట్టింట ట్రోల్ అవుతున్నాయి. ఏదేమయినప్పటికీ అధికార పార్టీలపై పోరాటం చేయడంలో రఘునందన్ సఫలీకృతం కాగా ఆ పోరుకు కొనసాగింపుగా ఆర్జీవీ మాటలు ఉన్నాయన్నది ఇవాళ సోషల్ మీడియాలో చర్చకు వస్తున్న విషయం.