నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ పరిస్థితి ఇప్పుడు తీవ్ర గందరగోళంగా మారింది. పార్టీకి కంచుకోటలాంటి నెల్లూరులో ప్రస్తుతం అత్యంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధిష్ఠానం తీరును దుయ్యబడుతున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిలతో వైసీపీకి తీవ్ర సంకటం ఏర్పడింది. వీరిద్దరినీ సముదాయించో.. బుజ్జగించో వైసీపీలో ఉంచుకునే ప్రయత్నం చేయడంలో పార్టీ అధిష్టానం పూర్తిగా విఫలమైందనే వాదన వినిపిస్తోంది.
పైగా.. ఇద్దరిపైనా పార్టీ అధినేత సీఎం జగన్.. తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే వాదన కూడా వినిపిస్తుండడం గమనార్హం. ముఖ్యంగా తన ఇంట్లో మనిషి అనుకున్న కోటంరెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై అధిష్ఠానం కొన్నాళ్లుగా సీరియస్‌గా ఉంది. గత 3 నెలలుగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పరిస్థితి కూడా ఇలానే ఉంది. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి వచ్చినప్ప టికీ.. ఆయనకు టికెట్ ఇచ్చారు. అయితే.. మంత్రి పదవి దక్కలేదనే కారణంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇక్కడ కూడా బుజ్జగింపులు లేకపోగా.. పార్టీ నుంచి పక్కనే పెట్టేశారు.
తాజాగా గన్మెన్లను తొలగించి, ఆనంను నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించి కొత్తవారిని నియమించారు. ఇక, ఇప్పుడు కోటంరెడ్డి పార్టీని వీడేందుకు సన్నద్ధం అవుతుండడం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈయన ప్లేస్‌లో కోటంరెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డిని నియమించాలని పార్టీలో చర్చ జరుగుతోంది. అదేసమయంలో పార్టీ పరిశీలనలో ఆనం విజయ్‌కుమార్ రెడ్డి పేరు కూడా ఉండడం గమనార్హం. ఈయన సతీమణి ప్రస్తుతం నెల్లూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా ఉన్నారు.
మొత్తంగా చూస్తే.. పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. మరోవైపు.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా బాగోలేదని సమాచారం. కాకాణి గోవర్ధన్‌రెడ్డికి.. మరో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలకు మధ్య అస్సలు పడడం లేదు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి కూడా పార్టీ అధిష్టానంపై గుస్సాగానే ఉన్నారు. తనకు మంత్రి పదవి దక్కలేదని ఆయన కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా ఎలా చూసుకున్నా.. నెల్లూరు జిల్లాలో 2019 నాటి మెరుపులు మసక బారుతుండడం గమనార్హం.