థియేటర్లలో ఫస్ట్ షో చూసి బయటికి వచ్చే ప్రేక్షకులను ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్ల ప్రతినిధులు మైకులు పెట్టి రివ్యూ లు అడగడం.. వాళ్లు తమ అభిప్రాయాన్ని చెప్పడం.. రిలీజ్ రోజు మధ్యాహ్నం నుంచి టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లు ఈ రివ్యూలతో హోరెత్తించేయడం చాన్నాళ్ల నుంచి నడుస్తున్న ట్రెండే. ఐతే ఇప్పుడు ఈ ట్రెండుకు అడ్డుకట్ట వేయడానికి కోలీవుడ్ నడుం బిగించింది.
వేట్టయాన్, కంగువ లాంటి చిత్రాలకు నెగెటివ్ రివ్యూలు నష్టం చేశాయంటున్న కోలీవుడ్ నిర్మాతల మండలి.. థియేటర్ల దగ్గర రివ్యూలు తీసుకోవడాన్ని నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్, దీని వల్ల ప్రేక్షకులకు టాక్ తెలియకుండా పోతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి కానీ.. తమిళ నిర్మాతలు మాత్రం ఈ విషయంలో పట్టుదలగానే ఉన్నారు. ఐతే టాలీవుడ్లోనూ ఈ విధానాన్ని అమలు చేసే దిశగా అడుగులు పడుతుండడం గమనార్హం.
టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు.
తమిళ నిర్మాతల మండలి నిర్ణయంపై దిల్ రాజును అడగ్గా.. ‘‘కోలీవుడ్లో తీసుకున్న నిర్ణయం విజయవంతం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నిర్ణయం అమలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ ఈ విషయంలో వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోలేం. ఫిలిం ఛాంబర్ జోక్యం చేసుకుని అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే చాలామంది ఎగ్జిబిటర్లు థియేటర్ల దగ్గర రివ్యూలను అడ్డుకోవడానికి సిద్ధపడ్డారు’’ అని చెప్పారు.
టాలీవుడ్లో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే అందులో దిల్ రాజు పాత్ర కీలకంగా ఉంటుంది. మరి ఆయనే రివ్యూలను ఆపే విషయంలో సుముఖత వ్యక్తం చేశారు అంటే.. ఈ నిర్ణయం తెలుగులోనూ అమలైనా ఆశ్చర్యం లేదు. కానీ ఈ మార్గంలో కాకపోతే మరోలా ప్రేక్షకులు ఫీడ్ బ్యాక్ తెలుసుకుంటారు కాబట్టి దీని వల్ల ఏమేర ప్రయోజనం ఉంటుందన్నది ప్రశ్నార్థకం.