ప్రస్తుతం తెలంగాణలో వివిధ సంక్షేమ పథకాల కింద ప్రజలకు ఫలితాలు అందుతున్నాయి. దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, గృహలక్ష్మి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. ఇలా చాలా పథకాలు ఇప్పుడు అమలవుతున్నాయి. ప్రభుత్వ సాయం కోసం చాలా మంది పేదవాళ్లు, మధ్య తరగతి వర్గాల ప్రజలు దరఖాస్తులు చేసుకుంటున్నారు. సాయం అందుతుందేమోనని ఆశగా చూస్తున్నారు. కానీ తీరా లబ్ధిదారుల జాబితా చూసే సరికి అందులో అన్ని పేర్లు బీఆర్ఎస్ కార్యకర్తలవే ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ బీఆర్ఎస్ కార్యకర్తలకే అందుతున్నాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అవును.. తమ పార్టీ వాళ్లకే అన్నీ ఇచ్చుకుంటామంటూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా బహిరంగంగా చెబుతుండటం గమనార్హం. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు తదితర ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఈ విషయంపై ఎలాంటి సంశయం లేకుండా బహిరంగంగానే ఉన్నది ఉన్నట్లు చెబుతున్నారు. ఇక లోలోపల వివిధ పథకాల కోసం తాము సూచించిన వ్యక్తులనే లబ్దిదారులుగా పేర్కొనాలంటూ అధికారులపై ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యకర్తలకే అన్నీ ఇచ్చిన తర్వాత ఇక వీటిని ప్రభుత్వ పథకాలు అనడం ఎందుకు పార్టీ పథకాలు అంటే సరిపోతుంది కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇతర పార్టీలకు మద్దతుగా ఉండే ప్రజల విషయంలో బీఆర్ఎస్ మరింత కక్షపూరితంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలున్నాయి. ఇది నిజమేనని చెప్పొచ్చు. తమ పార్టీ వాళ్లకే ఇచ్చుకుంటామంటే ఇదేమీ సీఎం కేసీఆర్ డబ్బు కాదని, అలాగే పార్టీ నుంచి పంచడం లేదనే ధిక్కారం ప్రజల నుంచి వస్తుంది. ప్రభుత్వ సొమ్మును పార్టీ కార్యకర్తలకు ఎలా ఇచ్చుకుంటారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అది కూడా అర్హత లేని వాళ్లకు ఇవ్వడం పట్ల ప్రజలు బీఆర్ఎస్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ఎన్నికల్లో ఓటుతోనే బీఆర్ఎస్కు బుద్ధి చెబుతామని ప్రజలు కోపంతో రగిలిపోతున్నట్లు సమాచారం.