తెలంగాణ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా చేసిన సంచలన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పెను దుమారం రేపుతున్నాయి. తాను శూద్రుడ్ని కాబట్టే తనకు స్వచ్ఛమైన హిందీ రాదంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను ఉద్దేశించి రేవంత్ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. నిర్మలా సీతారామన్ బ్రాహ్మణ వాది అని, అందుకే ఆమెకు స్వచ్ఛమైన హిందీ వచ్చని రేవంత్ వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది.
సమావేశాల సందర్భంగా అమెరికా డాలర్ తో పోలిస్తే మన రూపాయి రోజురోజుకూ పడిపోతోందని, రూపాయి విలువ పెరిగేందుకు కేంద్రం ఏం చర్యలు తీసుకుంటోందని లోక్ సభలో రేవంత్ ప్రశ్నించారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, అది చూసి కొందరు ప్రతిపక్ష నేతలకు అసూయ కలుగుతోందని నిర్మల సమాధానమిచ్చారు. దేశ ప్రగతిని కొందరు జోక్ గా తీసుకుంటున్నారని విమర్శించారు. అంతేకాదు, తెలంగాణ నుంచి వచ్చిన రేవంత్ తక్కువ స్థాయి హిందీలో మాట్లాడుతున్నారని, ఆయనకు జవాబిచ్చేందుకు తాను కూడా తక్కువ స్థాయి హిందీలోనే మాట్లాడుతున్నానని అన్నారు.
దీంతో, రేవంత్ ను ఉద్దేశించి నిర్మల చేసిన వ్యాఖ్యలపై రేవంత్ తో పాటు కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాను శూద్రుడినంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కూడా నిర్మలా సీతారామన్ పార్లమెంటులో మాట్లాడిన భాష ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉందని ట్విటర్ లో కూడా రేవంత్ విమర్శించారు. ఆమె వైఖరి విచారకరం అని రేవంత్ ట్వీట్ చేశారు. బ్రిటీష్ వారి మాదిరిగానే బీజేపీ ఎప్పుడూ విభజించు-పాలించు రాజకీయాలను అనుసరిస్తుందని విమర్శించారు. వారు దేశ ప్రజలను భాష, ఆహారం, కులం, మతం ఆధారంగా విభజించారని రేవంత్ ఆరోపించారు. ఏది ఏమైనా రేవంత్ పై నిర్మల చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా నిర్మల చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి.