ఎన్నికల్లో గెలుపుకు ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ హామీల్లో రు. 500 కే గ్యాస్ సిలిండర్ కూడా ఒకటి. నిజానికి ఇలాంటి హామీలు ఇవ్వటం, ఇచ్చిన హామీలను అమల్లోకి తేవటం అంటే రాష్ట్రప్రభుత్వం ఖజానాపై విపరీతమైన ఆర్ధికభారం పడటమే. అయినా సరే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో అన్నీ పార్టీలో ఆచరణసాధ్యంకాని హామీలను ఇచ్చేస్తున్నాయి. జనాలు కూడా వాటికే ఆకర్షితులవుతు ఓట్లేస్తున్నారు. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఈనెలాఖరు నుండి మూడో హామీని రేవంత్ రెడ్ది ప్రభుత్వం ఆచరణలోకి తీసుకురావాలని అనుకుంటున్నట్లు సమాచారం.
ఇంతకీ మూడో హామీ ఏమిటంటే రు. 500 కే గ్యాస్ సిలిండర్. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని రు. 5 లక్షల నుండి రు. 10 లక్షలకు ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. అంటే సిక్స్ గ్యారెంటీస్ లో ప్రభుత్వం రెండింటిని అమల్లోకి తెచ్చేసింది. అందుకనే మూడో గ్యారెంటీని ఈనెలాఖరులోగా తేబోతోంది. ఇదే విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో ఒకటికి రెండుసార్లు సమీక్షలు జరిపారు.
రు. 500 కే గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకాన్ని ఈనెల 28వ తేదీన ప్రారంభించేందుకు ముహూర్తంగా పెట్టుకున్నారట. కారణం ఏమిటంటే డిసెంబర్ 28వ తేదీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవమట. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పి సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ అందించే పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారట. సమీక్షలో రెండు అంశాలు చర్చకు వచ్చాయని సమాచారం. అవేమిటంటే గ్యాస్ సిలిండ్ సబ్సిడీని తెల్లరేషన్ కార్డు దారులకు మాత్రమే వర్తించాలా ? లేకపోతే అందరికీ వర్తించాలా అన్నది.
రాష్ట్రంలో మొత్తం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షలున్నాయి. వీరిలో ప్రతినెలా 40 శాతం వినియోగదారులు రీఫిల్ చేసుకుంటున్నారు. మరికొందరు రెండునెలలకు ఒక సిలిండర్ మారుస్తారు. అందుకనే ముందుగా తెల్లరేషన్ కార్డులున్న వాళ్ళకి పథకంలో లబ్దిదారులుగా చేరిస్తే బాగుంటందనే సూచన వచ్చింది. మరి రేవంత్ ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పథకం అమలుకు ప్రభుత్వంపై రు. 4450 కోట్లు భారం పడటం ఖాయమని అంచనా.