తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత సభ వేదికపై నుంచే తొలిసారిగా ప్రజలనుద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ప్రత్యేక తెలంగాణ ఎందరో అమరవీరుల త్యాగాల, పోరాటాల పునాదుల మీద ఏర్పడిందని రేవంత్ భావోద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్ పార్టీ సమిధగా మారి ప్రత్యేక తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. పదేళ్లుగా ఉన్న ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, ప్రజల బాధలను పట్టించుకోలేదని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
గత ప్రభుత్వ అన్యాయాలని మౌనంగా ప్రజలు భరించారని, అందుకే ప్రజా ప్రభుత్వాన్ని కోరుకొని కాంగ్రెస్ కు పట్టం కట్టారని అన్నారు. నిరుద్యోగులు, మహిళలు, యువత, ప్రజలు, అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగిస్తామని హామీనిచ్చారు . ఈ క్రమంలోనే ప్రగతి భవన్ చుట్టూ ఉన్న కంచెలను బద్దలు కొట్టామని, ఈ ప్రభుత్వంలో ప్రజలు కూడా భాగస్వాములేనని, ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రజాభవన్ కు రావచ్చని రేవంత్ అన్నారు.
ప్రజలు, యువత, మేధావులు ప్రభుత్వానికి తమ సూచనలు, సలహాలు ఇవ్వొచ్చని అందరం కలిసి తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని రేవంత్ అన్నారు. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజా భవన్ దగ్గర కంచెలు బద్దలు కొడతమాని, అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తామని రేవంత్ ప్రకటించారు. ఆ ప్రజాదర్బార్ కు వచ్చి ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవచ్చాని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా అభివృద్ధి పథంలో నడిపిస్తానని, ప్రపంచంతో పోటీ పడేలాగా అభివృద్ధి చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.
నిస్సహాయులు, నిరుపేదలు, సామాన్య ప్రజలు తమను పట్టించుకునేవారు లేరు అనే భావన కలిగించబోమని, కాంగ్రెస్ ప్రభుత్వం,తాను ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని అన్నారు. ఎన్నికల సమయంలో లక్షలాదిమంది కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో తమ సహకారం అందించాలని, వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీల ఫైలు పై రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు.
ఆ వెంటనే దివ్యాంగురాలు రజనీకి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ ఇంకో ఫైల్ పై కూడా రేవంత్ సంతకం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రజనీకి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని ఎన్నికల ప్రచారం సందర్భంగా రేవంత్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్నమాట ప్రకారమే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రజనీకి ఉద్యోగం కల్పిస్తూ సభా వేదికపైనే ఆమెను సత్కరించి ఉద్యోగ నియామకానికి సంబంధించిన పత్రాలను అందజేశారు.