తెలంగాణలో కాంగ్రెస్ క్రమంగా బలపడుతోంది. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు సానుకూల ఫలితాలు వస్తాయనే అంచనాలు కలుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అండ్ కో ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దనే పట్టుదలతో ఉన్నారు. ఇదే ఊపులో ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. పార్టీలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి కీలక నేతలను చేర్చుకుంటున్నారు. మరోవైపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే తదితర అగ్ర నాయకులతో సభ నిర్వహించారు. గ్యారెంటీ హామీల పేరుతో ప్రజలకు కార్డులను పంచుతున్నారు. ఈ క్రమంలో పార్టీకి నష్టం కలిగేలా.. అలాగే బీఆర్ఎస్కు లాభం చేకూర్చేలా ఎలాంటి పరిణామం ఎదురవొద్దనే భావనతో కాంగ్రెస్ ఉంది. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాకముందే రేవంత్ రెడ్డి కౌంటర్లు వేస్తున్నారని చెప్పాలి.
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రస్తుతం రిమాండ్ మీద జైల్లో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజల్లో బాబుపై సానుభూతి వ్యక్తమవుతుందనే అభిప్రాయాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఇది కలిసొస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడీ మరోసారి నోటీసులు పంపించింది. మరోవైపు సుప్రం కోర్టు ఇచ్చిన పది రోజుల గడువు తర్వాత ఈడీ విచారణ కవిత హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కవితను అరెస్టు చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. అదే జరిగితే ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు సింపతీ కలిసొచ్చే ఆస్కారముందనే చెప్పాలి. కవిత అరెస్టు విషయాన్ని ముందేసుకుని మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావొచ్చన్నది విశ్లేషకుల మాట.
కవిత అరెస్టు కాకముందే రేవంత్ రెడ్డి అలర్టయ్యారు. ఒకవేళ కవిత అరెస్టయితే ప్రజల్లో సానుభూతి రాకుండా ఉండేందుకు ముందుగానే రివర్స్ లో రేవంత్ కౌంటర్లు వేస్తున్నారని చెప్పొచ్చు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు తన బిడ్డ కవితను జైలుకు పంపించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని రేవంత్ ఆరోపిస్తున్నారు. తీహార్ జైలుకు ఆమెను పంపించేలా మోదీతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని రేవంత్ అన్నారు. దీంతో ప్రజల్లో సానుభూతి పొంది మరోసారి గెలవాలన్నది కేసీఆర్ ప్లాన్ అని రేవంత్ విమర్శిస్తున్నారు. కిషన్ రెడ్డి.. కేసీఆర్ అనుచరుడని రేవంత్ ఆరోపించారు. అవినీతికి పాల్పడిన కేసీఆర్ సర్కారుపై ఇప్పటివరకూ ఈడీ, సీబీఐ కేసులే లేవని చెప్పారు. మొత్తానికి కవిత అరెస్టుకు ముందే రేవంత్ పక్కా ప్లాన్ తో సాగుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.