టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ముఖ్యమైన జిల్లాలో పట్టు దొరకడం లేదా..? అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ దాదాపు అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్న రేవంతుకు ఆ ఒక్క జిల్లాలో మాత్రం ఎంట్రీ లభించడం లేదా..? ఒకరిద్దరు సీనియర్ నేతలు రేవంత్ రాకను వ్యతిరేకిస్తున్నారా..? దీనిపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ శాఖ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి దాదాపు ఏడాది కావస్తోంది. ఈ సంవత్సర కాలంలో అచేతనావస్థలో ఉన్న పార్టీని పోటీలోకి తీసుకొచ్చారు రేవంత్. తన దూకుడుతో పార్టీ శ్రేణుల్లో ధైర్యం కలిగించారు. నీరసంగా ఉన్న నేతల్లో తన వరుస పర్యటనలు, బహిరంగ సభలతో ఉత్సాహం తీసుకొచ్చారు. అంతకుముందు వరకు నిరాశతో ఉన్న కార్యకర్తల్లో అధికారం పట్ల ఆశ కలిగించేలా చేశారు. ఇదంతా రేవంత్ వ్యక్తిగత చలవే. పార్టీ సీనియర్లు వ్యతిరేకించినా.. తన పర్యటనలకు సహకరించకపోయినా మొండిగా ముందుకు వెళ్లారు.
దీంతో అధిష్ఠానం అప్రమత్తమై నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇటీవల రాహుల్ గాంధీ పార్టీ నేతలందరితో భేటీ అయి కలిసి పనిచేయాల్సిందిగా సూచించారు. కొద్ది రోజులు నేతలు కలిసికట్టుగానే పనిచేశారు. అయితే ఇది మేడిపండు చందంగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. రాహుల్ గాంధీ వరంగల్ సభకు హాజరుకానున్న నేపథ్యంలో రేవంత్ జిల్లాల్లో సన్నాహక సమావేశాలు పెట్టుకున్నారు.
ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో తిరుగుతున్న రేవంతుకు ఆ జిల్లా సీనియర్లు షాక్ ఇచ్చారు. రేవంతు తమ జిల్లాకు రావాల్సిన అవసరం లేదని.. తాము చూసుకుంటామని తేల్చి చెప్పారు. వారు ఎవరో కాదు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కీలక నేతలు కోమటి రెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీరి వ్యాఖ్యలపై రేవంత్ వర్గం, పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ హోదాలో రావద్దనడానికి వారెవరని ప్రశ్నిస్తున్నారు.
నల్లగొండ జిల్లా కోమటి రెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ జాగీరు కాదని నేతలు ధ్వజమెత్తారు. ఒక్కో సీనియర్ నేత నాలుగైదు నియోజకవర్గాలను తమ గుప్పిట పెట్టుకొని తమ వారికే సీట్లు ఇప్పించుకుంటున్నారని.. ఇప్పటికైనా మార్పు రావాల్సిందేనని భగ్గుమన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్న రేవంత్ ఒక్కసారి కూడా నల్లగొండకు రాలేదని.. ఆయన వస్తేనే పార్టీ కార్యక్రమాలకు సహకరిస్తామని తేల్చిచెబుతున్నారు. సీనియర్లకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా సమావేశాలు కూడా పెట్టుకుంటున్నారు. చూడాలి మరి రేవంత్ ఆ జిల్లాలో కాలు పెడతారో.. లేదో..!