కొద్ది రోజులుగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై టీఆర్ఎస్ సర్కార్ పోరుబాటపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. అయితే, ఈ రోజు పార్లమెంటు నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేస్తారని, వారు సభను బాయ్ కాట్ చేస్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందే చెప్పారు. రేవంత్ చెప్పినట్లే ఈ రోజు నుంచి పార్లమెంటు సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు బాయ్ కాట్ చేశారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాల మొత్తం సెషన్ ను బాయ్ కాట్ చేశామని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు చెప్పారు. మొత్తం 9 మంది లోక్ సభ, 7 గురు రాజ్యసభ సభ్యులు బాయ్ కాట్ చేయడం బాధాకరమైనదేనని, కానీ, కేంద్రం తీరుకు నిరసనగా అలా చేయక తప్పలేదని అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై గత 7 రోజులుగా నిరసనలు తెలుపుతున్నా కేంద్రం పట్టించుకోలేదని, కొనుగోళ్ల విషయంలో ఎఫ్‌సీఐ నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ పరిస్థితుల కారణంగా రబీలో పండే ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా మారుస్తామని, కానీ, బాయిల్డ్ రైస్ ను కొంటారో, లేదో కేంద్ర ప్రభుత్వం స్పష్టతనివ్వడం లేదని ఆరోపించారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల పేరుతో విషయాన్ని పక్కదోవ పట్టించారని, పార్లమెంట్ ను టీఆర్ఎస్ సభ్యులు బహిష్కరించారని రేవంత్ ఫైర్ అయ్యారు. ఈడీ నోటీసుల క్రమంలో కేసీఆర్‌కు, కేంద్రానికి కొంత గ్యాప్ వచ్చిందని, ఈడీ విచారణ నుంచి తప్పించుకునేందుకే పార్లమెంట్‌ను వేదికగా టీఆర్ఎస్ డ్రామాలాడిందని ఆరోపించారు. ఈడీ నోటీసులను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసిందని సంచలన ఆరోపణలు చేశారు.