టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పడంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. రేవంత్ నియామకంపై కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నప్పటికీ…చాలామంది నేతలు రేవంత్ వెంట అడుగులు వేసేందుకు క్యూ కడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు రేవంత్ వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. తనపై అసమ్మతి ఉన్న నేతల వ్యవహారాన్ని పక్కనబెట్టిన రేవంత్…భవిష్యత్ కార్యచరణపై ఫోకస్ చేశారు.
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా రేవంత్ తనదైన ప్రణాళికలతో ముందుకు వెళ్లబోతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాల్లో పర్యటిస్తున్న రేవంత్…పీసీసీ చీఫ్ అయ్యాక తొలిసారి ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఫుల్ కిక్ వచ్చేలా ప్రసంగించారు. ఈ క్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పువ్వాడను కమ్మ పెద్దలు కులం నుంచి కూడా బహిష్కరించాలని రేవంత్ సంచలన పిలుపునిచ్చారు.
పువ్వాడ అక్రమాలపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, ఆరోపణల పట్ల పువ్వాడే స్వయంగా సీబీఐ విచారణ కోరాలని రేవంత్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి భయపెట్టాలని పువ్వాడ చూస్తున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు భయపడాల్సిన అవసరంలేదని రేవంత్ అభయ హస్తమిచ్చారు. తమ కార్యకర్తలపై వేధింపులకు పాల్పడే అధికారుల పేర్లను డైరీలో రాసిపెడుతున్నామని, రేపు వారు ఎక్కడున్నా తీసుకొచ్చి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
రేవంత్ కామెంట్లపై మంత్రి పువ్వాడ దీటుగా స్పందించారు. తాను ఏ విచారణకైనా సిద్ధమేనని అన్నారు.. భూములు కబ్జా చేశానని తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, కావాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించుకోవాలని రేవంత్ ను ఉద్దేశించి సవాల్ విసిరారు.