హైద్రాబాద్ నగరంలో బంజారాహిల్స్ కేంద్రంగా అడ్డంగా దొరికిపోయిన పబ్ ప్రముఖుల్లో చాలా మంది పేర్లు వినపడుతున్నాయి. అసలు ఈ పబ్ కే అత్యంత ప్రాధాన్యం ఉంది అని తెలుస్తోంది. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి దగ్గరి బంధువుదే ఈ పబ్ అని ప్రాథమిక సమాచారం. ఉగాది సందర్భంగా అక్కడ బర్త్ డే పార్టీ ఒక్కటే కాదు చాలా మంది వేర్వేరు కారణాలతో అక్కడికి చేరుకుని తమ సంతోష సమయాలను వెచ్చించారు అని కూడా తెలుస్తోంది. ఈ కేసులో రేణుకా చౌదరి పేరు ఒక్కటే కాదు రేవంత్ రెడ్డి పేరు కూడా వినపడుతోంది. అంటే వీళ్లకు ఈ కేసులో నేరుగా అనుబంధం ఉందని కాదు కానీ వాళ్లకు చెందిన బంధువులు మాత్రం అడ్డంగా ఇరుక్కుపోయారు.
ఈ కోవలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మేనల్లుడు సూదిని ప్రణయ్ రెడ్డి ఒకటి ప్రస్ఫుటంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవానికి పోలీసులకు చిక్కిన 150 మందిలో చాలా మంది డ్రగ్స్ తీసుకోలేదని కూడా తేలింది. 15 నుంచి 20 మంది మాత్రమే డ్రగ్ తీసుకున్నారని కూడా అంటున్నారు అక్కడికి వెళ్లిన కొందరు ప్రత్యక్ష సాక్షులు. వాస్తవానికి మీడియా అతి చేస్తున్న విధంగా అక్కడున్న వారంతా డ్రగ్ ఎడిక్ట్స్ కాదని కూడా స్పష్టం చేస్తున్నారు. పండగ కావడంతోనే ఆ పబ్ కు వెళ్లి ఉంటారని, ఇంకొందరు బర్త్ డే పార్టీతో పాటు ఇంకొన్ని కారణాలతో ఆ వేడుకలో భాగం అయి ఉన్నారని తెలుస్తోంది.
కారణం ఏదయినా పబ్ నిర్వాహకులు పెద్ద పెద్ద నాయకులకు చెందిన వారు కావడంతోనే అన్నీ అనుమతులూ ఉండి ఉంటాయన్న నమ్మకంతోనే లేట్ నైట్ పార్టీకి సిద్ధం అయి ఉంటారని ఓ సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఆఖరి నిమిషంలో పోలీసుల మెరుపు దాడులతో డ్రగ్స్ తీసుకున్న వారు, తీసుకోని వారు ఇలా అంతా కలిపి 150 మంది సమీప స్టేషన్ కు వెళ్లాల్సి వచ్చింది. శనివారం తెల్లవారు జామున పట్టుబడిన వీరంతా మరుసటి రోజు అంటే ఆదివారం ఉదయం వరకూ స్టేషన్లోనే గడపాల్సి వచ్చింది. అయితే వీళ్ల ఫోన్లు సీజ్ చేయడం కానీ లేదా ఇతర కాల్ డేటా కానీ ఇంతవరకూ ఎనలైజ్ చేయాలేదని కూడా తెలుస్తోంది. ఇక వివాదంతో రేవంత్ బంధువుకు సంబంధం ఉండడంతో తెలంగాణ రాష్ట్ర సమితి గగ్గోలు పెడుతోంది. ఏదేమయినప్పటికీ బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని అంటోంది టీ సర్కార్.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సంబంధం లేకున్నా తమ పిల్లలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘నా మేనల్లుడిగా చెబుతున్న ప్రణయ్ రెడ్డి నుంచి రక్త నమూనాలతో పాటు ఇతర నమూనాలను ఇప్పిస్తా.. మా కుటుంబంతో పాటు, బంధువుల్లో అనుమానాలు ఉన్న వారి పేర్లు చెబితే వారిని తీసుకొచ్చి నమూనాలు ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నా. అయితే ఈ విషయంలో కేటీఆర్‌తో నమూనాలు ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నారా..’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.