తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు రాజకీయం రచ్చ రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు బైపోల్ లో కాంగ్రెస్ లేనట్టుగా చూపించేందుకు టిఆర్ఎస్, బిజెపిలు సమన్వయంతో పనిచేస్తున్నాయని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
అందుకే, ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా వ్యూహత్మకంగానే ఈ తరహా వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. మునుగోడు ఉపఎన్నికతో పాటు, భారత్ జోడో యాత్రల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ నాటకాలకు ఆ రెండు పార్టీలు తెరతీశాయని ఆరోపించారు. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లను ఎందుకు సీజ్ చేయలేదు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్ కనుసన్నల్లోనే ఏసీబీ నడుస్తోందని, ఆయన పర్యవేక్షణలోనే ఈ కేసు విచారణ తతంగం జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇక, ఈ కేసులో ఏ1గా కేసీఆర్ ను, ఏ2గా కేటీఆర్ ను, ఆ నలుగురు ఎమ్మెల్యేలను కూడా నిందితులుగా చేర్చి దర్యాప్తు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అంతేకాదు, దర్యాప్తు సంస్థలపై తమకు నమ్మకం లేదని, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ కేసు విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు . రేవంత్ వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్ ల స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.