హుజురాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఈ ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ బైపోల్ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు వర్షం గుప్పిస్తున్నారు. కాంగ్రెస్లో కోవర్టులున్నారంటూ విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు దీటుగా జవాబిస్తున్న రేవంత్…బీజేపీలోనూ కోవర్టులున్నారంటూ రేవంత్ దుయ్యబడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎవరినో గెలిపించేందుకు పనిచేస్తోందన్న కేసీఆర్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల వెనుక కేసీఆర్ ఉన్నారని, ఈటలను బీజేపీలోకి పంపించింది కేసీఆరేనని షాకింగ్ కామెంట్లు చేశారు. బీజేపీలో ఈటల చేరగానే భూకబ్జాలపై దర్యాప్తు ఆగిపోయిందని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ అభ్యర్థిగా ఈటల నియామకం కూడా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చిన ప్రైవేట్ విమానం కూడా కేసీఆర్ పంపినదేనని షాకింగ్ ఆరోపణలు చేశారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిల యాత్రలు కేసీఆర్ అనుకల, వ్యతిరేక వర్గాల పోరాటమేనని రేవంత్ అన్నారు. బీజేపీలో విభేదాలున్నాయని రేవంత్ నర్మగర్భవ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ సన్యాసుల మఠం కాదని, ఎవరినో గెలిపించేందుకు పనిచేయదని కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ ఇలాకా గజ్వేల్లో దీక్ష చేయడం పక్కా అని, గజ్వేల్లో ఉపఎన్నిక రావాలంటే కేసీఆర్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. అలా జరిగితే కేసీఆర్పై పోటీ చేయాలా వద్దా అనేది పార్టీ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగానే మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పదవికి రాజీనామా చేశారని అన్నారు. రాహుల్ బొజ్జా సమర్థవంతమైన అధికారి అని, ఆయనకు అవకాశం ఇచ్చానని కేసీఆర్ చెప్పడం సరికాదని రేవంత్ అన్నారు.