తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా సీఎల్పీ నేత రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేబినెట్ కూర్పుపై చర్చించేందుకు ఢిల్లీ రావాలని రేవంత్ కు కాంగ్రెస్ హై కమాండ్ కబురు పంపింది. దీంతో, సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గేలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత హైదరాబాద్ కు బయలుదేరేందుకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చారు. అయితే, అనూహ్యంగా ఎయిర్ పోర్టుకు వెళ్లిన తర్వాత రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే వెనక్కి పిలిపించారు.
కాంగ్రెస్ పెద్దల నుంచి వెనక్కి రావాలని పిలుపు వచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి వెనక్కి వెళ్లడం చర్చనీయాంశమైంది. అయితే, క్యాబినెట్లో మార్పుల నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితో మహారాష్ట్ర సదన్ లో ఠాక్రే భేటీ అయ్యారని తెలుస్తోంది. మంత్రివర్గ కూర్పుపై వీరు మరోసారి చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత మంత్రివర్గంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ భేటీ అయిన తర్వాత రేవంత్ హైదరాబాద్ బయలుదేరే అవకాశముంది.
రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. డిజిపి రవి గుప్తా, జిహెచ్ఎంసి కమిషనర్ రొనాల్డ్ రాస్ తో కలిసి భద్రతా ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. రేవంత్ రెడ్డి తో పాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే, టిడిపి అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ లు హాజరు కాబోతున్నారని తెలుస్తోంది.
వీరితోపాటు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రొఫెసర్ హర గోపాల్, కంచె ఐలయ్యలను కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. అంతే కాకుండా, మాజీ కేంద్ర ఆర్థిక శాఖఆ మంత్రి చిదంబరం, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, వాయలార్ రవి, సుశీల్ కుమార్ షిండే వంటి సీనియర్ నేతలు కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారని తెలుస్తోంది. ఇక, తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశఆరు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం వచ్చిందని, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రజలంతా రావాలని రేవంత్ పిలుపునిచ్చారు.