తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా, సీఎల్పీ నేత రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. దాదాపు 3 రోజుల హైడ్రామాకు తెరదించుతూ నిన్న సాయంత్రం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ కూర్పు, పోర్ట్ ఫోలియోలు వంటి వ్యవహారాలపై చర్చించేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నా రేవంత్ తాజాగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ లతో భేటీ అయ్యారు.
ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని వారందరినీ రేవంత్ వ్యక్తిగతంగా ఆహ్వానించారు. సీఎల్పీ నేతగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ఎన్నుకున్నందుకు సోనియా, రాహుల్, ప్రియాంకా, ఖర్గే, వేణుగోపాల్ కు రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. కేబినెట్ కూర్పుపై సోనియాతో రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది. ఇక, తన ఎంపీ ఫ్లాట్ లో రేవంత్ రెడ్డికి ఆతిథ్యం ఇవ్వడం సంతోషాన్నిచ్చిందని ఠాకూర్ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ను ఉన్నత శిఖరాలకు చేర్చినట్లే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో రేవంత్ నడిపిస్తారన్న నమ్మకం తనకుందని ఆయన అన్నారు.
మరోవైపు, తన ఎంపీ పదవికి రేవంత్ రెడ్డి ఈ రోజు రాజీనామా చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక, ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రేవంత్ తిరిగి రాబోతున్నారు. మరోవైపు, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం సమయంలో మార్పులు చేశారు. వాస్తవానికి ఉదయం 10.28 నిమిషాలకు రేవంత్ రెడ్డి తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే, ఆ సమయాన్ని మధ్యాహ్నం 1.04కు మార్చారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎల్బి స్టేడియంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు హాజరు కాబోతున్నారు. మరోవైపు, రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సీఎల్పీ నేతగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన సోదరుడు రేవంత్ రెడ్డికి అభినందనలు అని ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలనను కూలదోసి, కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చిన ప్రజలకు కోమటిరెడ్డి ధన్యవాదాలు చెప్పారు. రేవంత్ రెడ్డికి బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా శుభాకాంక్షలు తెలిపారు.