టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమితులైన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ ను గెలిపించడమే లక్ష్యంగా త్వరలో రేవంత్ రెడ్డి తెలంగాణలో పాదయాత్ర చేపడతారని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ రెడ్డి…ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
తెలంగాణలో కాంగ్రెస్ కు పూర్వవైభవం తెచ్చేందుకు రేవంత్ సరైన వ్యక్తి అని కాంగ్రెస్ అధిష్టానం భావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రేవంత్ చేపట్టబోయే పాదయాత్రకు ప్రచారం కల్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం గట్టి ప్రయత్నాలు చేస్తోందని టాక్ వస్తోంది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో రామోజీరావుకు ఉన్న పరిచయం దృష్ట్యా ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
తెలంగాణలో బలంగా ఉన్న టీఆర్ఎస్ ను ఎదుర్కొనాలంటే మీడియా సపోర్ట్ గట్టిగా ఉండాలని సోనియా భావించారని, ఈ క్రమంలోనే పాదయాత్ర నేపథ్యంలోనే రామోజీరావుతో రేవంత్ భేటీ అయ్యారని తెలుస్తోంది. కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు రేవంత్ తో పాటు కాంగ్రెస్ క్యాడర్ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తోన్న నేపథ్యంలో ఇటు ఈనాడు వంటి దిగ్గజ మీడియా సంస్థ సపోర్ట్ కూడా తోడైతే అధికార పార్టీని ఇరకాటంలో పెట్టవచ్చని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని టాక్ వస్తోంది.