తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ హైకమాండ్ ఎన్నుకుంది. సీఎల్పీ నేతగా రేవంత్ ను సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని కాంగ్రెస్ నేత వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. దీంతో, రెండు రోజులుగా ఈ వ్యవహారంపై నడుస్తున్న హై డ్రామాకు తెరపడింది. ఈ నెల 7వ తేదీ ఉదయం 10.28 నిమిషాలకు రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరోవైపు, కేబినెట్ కూర్పు గురించి చర్చించేందుకు రేవంత్ ను ఢిల్లీ రావాలని కాంగ్రెస్ పెద్దల నుంచి పిలుపు వచ్చింది.
దీంతో, బేగంపేట నుంచి ఢిల్లీకి రేవంత్ బయలుదేరి వెళ్లారు.
గతంలో టీడీపీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి..చంద్రబాబు శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు శిక్షణలో రాటుదేలిన రేవంత్ కేసీఆర్ ను ఢీకొని తెలంగాణకు రెండో సీఎం కాబోతున్నారు. రేవంత్ కు మంచి రాజకీయ భవిష్యత్ ఉందని గతంలో చంద్రబాబు పలుమార్లు చెప్పారు. ఆయన తీర్చిదిద్దిన రేవంత్ … చంద్రబాబు హయాంలో ఎమ్మెల్యేగా ఉండి ఆ తర్వాత సీఎం అయిన కేసీఆర్ ను ఓడించారు.