తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చిన తాజా విమర్శ తెలంగాణ అధికారపక్షంలో మంట పుట్టేలా చేస్తోంది. ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై ఆయన చేస్తున్న తాజా ఆరోపణలకు సమాధానాలు చెప్పలేక కిందా మీదా పడుతున్నారు. అనూహ్యంగా రేవంత్ సంధించిన ప్రశ్నల్ని ఎలా ఎదుర్కోవాలన్నది ఇప్పుడు గులాబీ దళానికి పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే.. రేవంత్ సంధించిన ప్రశ్నాస్త్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ మీదనే కావటం.
మంత్రి కేటీఆర్ ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయటమేకాదు ఆయన్నుచంచల్ గూడ జైల్లో పెట్టాలని వ్యాఖ్యానించటం ద్వారా సంచలనంగా మారారు. దీనికి ఆయన కారణాన్ని ఎత్తి చూపుతూ.. మంత్రి పీఏకు పేపర్ లీకేజీలో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. లీకేజీకి ఇద్దరే నిందితులని మంత్రి కేటీఆర్ ప్రకటించటాన్ని తప్పు పట్టిన రేవంత్ మరో బాంబును పేల్చారు. ఇప్పటికే జైల్లో ఉన్న తొమ్మిది మందిని విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు రావటమే కాదు.. పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తాయన్నారు.
‘చంచలగూడ జైల్లో ఉన్న తొమ్మిది మంది నిందితులను కొందరు జైలుకు వెళ్లి ఎన్ కౌంటర్ చూస్తామని బెదిరించారు. ఈ నెల 13 నుంచి 18 వరకుజైలుకు సందర్శించిన వారి వివరాలు బయటపెట్టాలి. సీసీ ఫుటేజ్ ను విడుదల చేయాలి’ అంటూ పాయింట్ బ్లాక్ లో పెట్టినట్లుగా సంధిస్తున్న ప్రశ్నలు షాకింగ్ గా మారాయి. మంత్రి కేటీఆర్ పేషీ నుంచే ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని చెప్పిన రేవంత్.. ‘‘మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి. షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. ప్రశ్నాపత్రాల లీకేజీల వ్యవహారాన్ని అతనే స్వయంగా నడిపాడు.
ఏ2గా ఉన్న రాజశేఖర్ రెడ్డికి టీఎస్ పీఎస్సీలో ఉద్యోగం ఇప్పించింది తిరుపతే. వీరిద్దరి మండలమైన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో 100 మందికి గ్రూప్ వన్ పరీక్షల్లో 103కు పైగా మార్కులు వచ్చాయి. ఈ వంద మంది వివరాల్ని ప్రభుత్వం బయటపెట్టాలి. 2016 నుంచి టీఎస్ పీఎస్సీ ద్వారా నిర్వహించిన పబ్లిక్ పరీక్షలు అన్నింటిపైనా సమగ్ర విచారణ జరిపించాలి’’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త కలకలానికి కారణంగా మారాయి.
అంతేకాదు.. నిబంధనలకు విరుద్ధంగా టీఎస్ పీఎస్సీలో పని చేసే ఉద్యోగులు కొందరు పరీక్షలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. వారు పరీక్షలు రాయటానికి అర్హులు కాదన్న రేవంత్.. 2016లో ఒక ఎన్ఆర్ఐ.. కమిషన్ ఉద్యోగురాలైన మాధురి పరీక్షలు రాసి స్టేట్ మొదటి ర్యాంకు సాధించారన్నారు. ‘టీఎస్ పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ గా పని చేసే రజనీకాంత్ రెడ్డి అప్పుడు గ్రూప్ 1 పరీక్ష రాసి నాలుగో ర్యాంకు సాధించాడు. ఇటీవల జరిగిన గ్రూప్ 1 లో టీఎస్ పీఎస్సీలో ఏఎస్ వోగా ఉన్నప్రవీణ్ తో పాటు శ్రీలక్ష్మి.. ప్రవీణ్.. వెంకటాద్రి.. శ్రీదేవి.. రమేశ్.. వాసు.. మధులత ఎలా రాశారు? వారు మొత్తం 20 మంది వరకు ఉన్నారు. వారికి ప్రభుత్వం ఎలా ఎన్ వోసీ ఇచ్చింది? సిట్ విచారణ వివరాలన్నీ మంత్రి కేటీఆర్ ముందుగానే విలేకరులకు ఎలా బహిర్గతం చేస్తారు?’’ అని పేర్కొన్నారు.
ఇదే కాదు.. సిట్ విచారణ చేస్తున్న విచారణ అధికారి ఎఆర్ శ్రీనివాస్ కు.. కేటీఆర్ బావమరిదికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రేవంత్ ఫైర్ అయ్యారు. వీరి సంబంధాల కారణంగా లీకేజీ కేసుపై ప్రభావితం చూపే వీలుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ మానత్వం కోల్పోయిందా? తెలంగాణ మేధావులు ఎక్కడున్నారు? అంటూ ప్రశ్నించిన రేవంత్.. ‘‘దేశపతి శ్రీనివాస్.. అల్లం నారాయణ లాంటి వారు ఎందుకు స్పందించటం లేదు. సమైక్య రాష్ట్రంలోనూ ఇంత నిర్బంధం చూడలేదు. ఆంధ్రాకు చెందిన ప్రవీణ్ కు టీఎస్ పీఎస్సీలో ఎలా ఉద్యోగం ఇచ్చారు?’’ అంటూ ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త కలకలానికి కారణంగా మారింది. పేపర్ల లీకేజీపై రేవంత్ చేస్తున్న ఆరోపణలకు ప్రగతిభవన్ ఉక్కిరిబిక్కిరి అవుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది.