తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2014 ఎన్నికల్లో ఇక్కడ గెలవాలని కాంగ్రెస్ చూసింది. కానీ ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ కు అప్పుడు జనాలు పట్టం కట్టారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు అంతంతమాత్రంగానే ఫలితాలు వచ్చాయి. మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుందనే ఆశలు ఆ పార్టీ నేతలు కోల్పోయారనే చెప్పాలి. సీనియర్ నేతలు పట్టించుకోకపోవడంతో పార్టీ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కానీ ఇప్పుడు సీన్ రివర్స్. తెలంగాణలో కాంగ్రెస్ కు పెరిగిన గ్రాఫ్. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే పరిస్థితి. దీనికి కారణం కచ్చితంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రేవంత్ ఓడిపోయారు. కానీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. 2021 జూన్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని హైకమాండ్ నియమించింది. అక్కడి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ కూ ఊపు వచ్చిందనే చెప్పాలి. ఓ వైపు సొంత పార్టీలోని సీనియర్లతో విభేధాలు వచ్చినా రేవంత్ తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతున్నారు. పార్టీని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. వివిధ కార్యక్రమాలతో మరోసారి ప్రజల్లోకి కాంగ్రెస్ తీసుకెళ్తున్నారు.
అధికార బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తూ, కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకుంటూ పదునైన మాటలతో ప్రజలను ఆకర్షిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు సానుకూల పవనాలు వీస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కీలక సమయంలోనూ రేవంత్ దూకుడు కొనసాగిస్తూ ప్రజల ఆదరణను ఓట్లుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సభలు, సమావేశాలతో జోరు ప్రదర్శిస్తున్నారు. ఈ సారి కొడంగల్ తో పాటు కేసీఆర్ ను ఓడించాలనే లక్ష్యంతో కామారెడ్డిలోనూ రేవంత్ పోటీకి దిగారు. మరోవైపు సీనియర్లు కూడా దారికి వచ్చి ఎవరి ప్రచారం వాళ్లు చేసుకోవడంతో కాంగ్రెస్ దూసుకెళ్తోంది.