కేసీఆర్ దళితబంధు పథకానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పక్కా కౌంటర్ రెడీ చేశారు. ఆగష్టు 9వ తేదీనుండి సెప్టెంబర్ 17 వరకు రాష్ట్రంలో దళిత దండోరా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. దళితబంధు పథకం ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రమే అమలు చేస్తే కుదరదని గట్టి వార్నింగే ఇచ్చారు. రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో ఉన్న దళితుల పరిస్ధితి ఏమిటంటు గట్టి పాయింటే లేవదీశారు.
రాష్ట్రంలోని 1.35 కోట్లమంది దళిత, గిరిజనులందరికీ తక్షణమే దళితబంధు పథకాన్ని వర్తింపచేయాలంటు కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ఒక్క హుజూరాబాద్ కు మాత్రమే పథకాన్ని వర్తింపచేయాలన్న కేసీఆర్ మోసాన్ని అంగీకరించేది లేదంటు రేవంత్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఒకవైపు కేసీఆర్ పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ ను తీసుకున్నట్లు చెబుతున్నా రేవంత్ మాత్రం రాష్ట్రమంతా వర్తింపచేయాల్సిందేనని డిమాండ్ చేయడమే ఆశ్చర్యంగా ఉంది.
ఇక్కడ కేసీఆర్ దే తప్పుంది. ఎలాగంటే ఓట్ల కోసమే తాను దళితబంధు పథకాన్ని తెచ్చినట్లు కేసీఆర్ స్వయంగా అంగీకరించారు. పైగా మాదేమైనా సన్యాసుల మఠమా, మాకు ఓట్లు రావద్దా అంటు అమాయకంగా ప్రశ్నించారు. అందుకనే ఇపుడు దళితబంధు పథకాన్ని రాష్ట్రమంతా వర్తింపచేయాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నది. వచ్చేనెల 9వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో లక్షమంది దళిత, గిరిజనులతో దళితదండోరా కట్టబోతున్నట్లు రేవంత్ చెప్పారు.
రేవంత్ తాజా ప్రకటన చూసిన తర్వాత కేసీఆర్ కు గట్టి కౌంటరే రెడీ చేసినట్లు అనిపిస్తోంది. కాకపోతే కేసీఆర్ దళితబంధు పథకం లబ్దిదారుల్లో కొంతమందికి మాత్రమే ఇపుడు వర్తిస్తుంది. అయితే రేవంత్ దళితదండోరా కార్యక్రమం దళిత, గిరిజనులందరికీ ఈ పధకాన్ని వర్తింపచేయాలని డిమాండ్ తో మొదలుపెడుతోంది. మరి ఎవరి స్కెచ్ పర్ఫెక్టుగా వర్కవుటవుతుందో చూడాల్సిందే. మరి వీరిద్దరి మధ్య బీజేపీ ఏమి ప్లాన్ చేస్తోందో చూడాలి.