టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈసారి తన నియోజకవర్గం మారనున్నారా..? తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కొడంగల్ ను వదిలి ఇతర ప్రాంతంపై దృష్టి పెట్టారా..? వచ్చే ఎన్నికల్లో కీలకంగా భావిస్తున్న ఒక నియోజకవర్గంపై కన్నేశారా..? ఇటీవల రేవంత్ అడుగులు చూస్తే ఇవే సందేహాలు కలుగుతున్నాయి. ఈ అంశంపై సోషల్ మీడియాలో కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
టీపీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు జిల్లాల్లో ర్యాలీలు, బహిరంగ సభలు, పాదయాత్రలు నిర్వహించి పార్టీకి దూకుడు నేర్పించారు రేవంత్. తెలంగాణ వ్యాప్తంగా పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్నప్పటికీ తన కంచుకోట అయిన కొడంగల్ ను మాత్రం పట్టించుకోవడం లేదట. ఇటీవల ఏఐసీసీ పాదయాత్ర కార్యక్రమం చేపట్టినప్పుడు మాత్రమే వచ్చారట. ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడడం లేదట. పార్టీ శ్రేణులు ఇది కూడా ఒక కారణంగా చెప్పుకుంటున్నారు.
తను పోటీ చేసే విషయంలో గతంలోనే క్లారిటీ ఇచ్చారు రేవంత్. తను మళ్లీ కొడంగల్ నుంచే పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. అయినా ఇటీవల పరిణామాల నేపథ్యంలో తన ఆలోచన మార్చుకున్నారట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఒక స్థానం తనకు సేఫ్ జోన్ గా భావిస్తున్నారట. తను ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోనే ఒక నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్లాలని ఉత్సుకత చూపిస్తున్నారట.
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఉప్పల్, ఎల్బీనగర్, మేడ్చల్ అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీకి దిగాలని యోచిస్తున్నారట. దీని వల్ల గ్రేటర్ పరిధిలో పార్టీని బలోపేతం అవుతుందని.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ స్థానాలు హస్తగతం చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారట.
రేవంత్ పోటీ స్థానంపై మరొక అభిప్రాయం కూడా వినిపిస్తున్నారు పార్టీ శ్రేణులు. ఆయన స్వస్థలం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట కాగా.. అది ఎస్సీ నియోజకవర్గం కావడంతో దాని పక్కనున్న కల్వకుర్తి నుంచి పోటీలో ఉంటారని చెబుతున్నారు.
కల్వకుర్తిలో అధికార పార్టీ నేతల మధ్య సయోధ్య లేదని.. అది తనకు లాభిస్తుందనే అభిప్రాయంలో ఉన్నారట. ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న వంశీచంద్ రెడ్డిని లోక్సభకు పంపించి.. కొడంగల్ లో తన సోదరుడిని బరిలో నిలపాలని ఆలోచిస్తున్నారట. ఈ అంశంపై రేవంతే స్వయంగా క్లారిటీ ఇస్తే ఈ ఊహాగానాలకు తెరపడుతుంది.