కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. టీపీసీసీ రథసారధిగా వ్యవహరిస్తున్న ఆయన.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఆర్నెల్ల వ్యవధిలో వచ్చేసిన వేళ.. పెద్ద ఎత్తున సభల్ని నిర్వహించుకుంటూ వెళుతున్నారు. మొన్నటికి మొన్న నల్గొండలో భారీ రోడ్ షోను నిర్వహించిన ఆయన.. తాజాగా పాలమూరు నిరుద్యోగ నిరసన సభను నిర్వహించారు. మరో వారం వ్యవధిలో సరూర్ నగర్ లో విద్యార్థి నిరుద్యోగ నిరసన ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతల్లో ఒకరైన ప్రియాంక వాద్రా వస్తున్నారు.
తాజా సభను చూస్తే.. కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు రేవంత్. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఒక్కొక్కటిగా అందరికీ అర్థమయ్యేలా మాట్లాడారు. పాలమూరు బిడ్డకు రాష్ట్ర కాంగ్రెస్ రథసారధిగా సోనియాగాంధీ అవకాశం ఇచ్చారని.. ‘మీ బిడ్డను సంపుకుంటారో.. సాదుకుంటరో మీరే ఆలోచించుకోవాలి. ఉమ్మడి జిల్లాలోని 14 ఎమ్మెల్యే.. 2 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలి. కేసీఆర్ ప్రభుత్వం పాలమూరును అవమానించింది. రాష్ట్రంలోని డెవలప్ మెంట్ నిధులన్నీ సిద్దిపేట.. సిరిసిల్ల.. గజ్వేల్ కు తరలుతున్నాయి’ అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
కల్వకుర్తి.. జూరాల.. నెట్టెంపాడు.. కోయిల్ సాగర్ ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలోనే కట్టినవన్న విషయాన్ని గుర్తు చేసిన రేవంత్.. కేసీఆర్ కరీంనగర్ నుంచి పారిపోయి పాలమూరుకు వస్తే ప్రజలు ఆదరించి ఎంపీగా గెలిపించారన్నారు. ‘కేసీఆర్ మాత్రం పాలమూరును అవమానించారు. తొమ్మిదేళ్లు అయినా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు? కాంగ్రెస్ హయాంలోనే మహబూబ్ నగర్ కు పాలమూరు వర్సిటీ వచ్చింది’’ అని కాంగ్రెస్ పాలనను గుర్తు చేయటం గమనార్హం.
తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గ పరిస్థితులు దాపురించాయని.. ఇన్నాళ్లు భూములు.. కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు కొల్లగొట్టారన్నారు. ఇప్పుడు లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాల్ని బలి పెట్టి ప్రశ్నాపత్రాల్ని అమ్ముకుంటున్నారన్నారు. ‘ఇదేనా తెలంగాణ మోడల్. పదో తరగతి ప్రశ్నాపత్రాలు వాట్సాప్ లో ప్రత్యక్ష మవుతున్నాయి. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరుకుతున్నాయి. ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణంగా ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్. నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని గత ఎన్నికల్లో కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ.. అదేమీ చేయలేదు. ఇప్పుడు అంబేడ్కర్ పేరు చెప్పి మళ్లీ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు’ అంటూ ఫైర్ అయ్యారు.