తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. వరుస ఆందోళనలతో హీట్ పుట్టిస్తున్న గులాబీ పార్టీ నేతలు గురువారం తెలంగాణలోని అన్ని జిల్లాకేంద్రాల్లో దీక్షలు చేపట్టింది.
టీఆర్ఎస్ దీక్షలతో జిల్లా కేంద్రాలన్నీ హోరెత్తాయి. దీక్షలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రైతుబంధు సమితి ఛైర్మన్లు సహా ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. దీనికి కొనసాగింపుగా నేడు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నివాసాలపై నల్లజెండాలు ఎగురవేశారు. అయితే, ఈ నిరసనపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ధాన్యం కొనుగోళ్ళు నిర్వహించాలని, తెలంగాణలో పండే ప్రతి గింజ కొనాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం టీఆర్ఎస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రైతులు, కార్యకర్తల ఇళ్ళపై నల్లజెండాలు ఎగరేసి నిరసన తెలిపారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, కార్యకర్తలు, రైతుల ఇళ్లపై నల్లజెండాల నిరసన కొనసాగుతోంది. వడ్ల కొనుగోలు పై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ మంత్రి హరీష్ రావు ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు నల్ల జెండా ఎగరవేశాయి.
సిద్దిపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటి పైన నల్ల జెండా ఎగరవేశారు రైతులు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ముఖ్య నేతల నివాసాలపై నల్లజెండాను ఎగురవేసి నిరసన వ్యక్తం చేయగా… ధాన్యం కొనుగోళ్ల పై బీజేపీ – టీఆర్ఎస్ ది బ్లేమ్ గేమ్ అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
టీఆర్ఎస్ పార్టీ నిరసనలపై రేవంత్ తనదైన శైలిలో స్పందిస్తూ, రైతులు తమ ఇళ్ల పై నల్లజెండా ఎగురవేయకపోతే రైతుబంధు ఇవ్వబోమని ఓ మంత్రి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని ట్విట్టర్లో రేవంత్ రెడ్డి ఆరోపించారు. “నేను రైతునే అని జబ్బలు చరుచుకునే కేసీఆర్ ఆయన నివాసం ఉండే ప్రగతి భవన్, ఫాంహౌస్ ల పై నల్ల జెండా ఎందుకు ఎగరేయలేదు?“అని రేవంత్ రెడ్డి లాజిక్ పాయింట్ లేవనెత్తారు.