మీరు అడగాల్సిన విధంగా అడగాలే కానీ.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తా. దాచుకునే ప్రశ్నే లేదన్నట్లుగా ఉంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు చూస్తే. ఐదారురోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న ఆయన సమయం చిక్కితే అక్కడి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగానో.. విలేకరుల భేటీలోనో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నల్ని ఆయన్ను సంధించటం.. వాటికి ఓపిగ్గా సమాధానాలు ఇవ్వటం చేస్తున్నారు.
సుమారు రెండు వారాల క్రితం ఒక ఆదివారం వేళ.. హైదరాబాద్ లోటస్ పాండ్ ముందు నిర్మించిన నిర్మాణాల్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయటం తెలిసిందే. ఈ వ్యవహారం పెను సంచలనంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. సీఎం రేవంత్ కు ఫోన్ చేయటంతోనే ఈ కూల్చివేతల ఎపిసోడ్ జరిగినట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. అందులో నిజం లేదని.. ఒక మంత్రి పర్సనల్ గా తీసుకొని చేసినట్లుగా ప్రచారం జరిగింది.
ఢిల్లీలో జరిగిన మీడియా ప్రతినిధుల ఇష్టాగోష్టిలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా రేవంత్ అనూహ్య రీతిలో ఓపెన్ అయి.. జరిగిన విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పేయటం విశేషం. చంద్రబాబు ఎప్పుడూ అలాంటి చిల్లర పనులు చేయరని.. ఆయన స్థాయికి అలాంటి ఆలోచనలే చేయరని స్పష్టం చేశారు రేవంత్. అయితే.. తమ మంత్రి ఒకరు వ్యక్తిగతంగా జీహెచ్ఎంసీ అధికారికి ప్రత్యేకంగా ఫోన్ చేసి ప్రత్యేకంగా చెప్పటంతోనే ఇలా జరిగిందని చెప్పారు.
ఈ సందర్భంగా తమ మంత్రి వర్గంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రికి ఏపీ మాజీ మంత్రి సుబ్బారెడ్డి యాభై సార్లు ఫోన్ చేసి.. కూల్చివేతను అడ్డుకోవాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఇలా ఇద్దరు మంత్రుల వ్యవహారం తప్పించి చంద్రబాబుకు దీంతో ఎలాంటి లింకు లేదన్నారు. ఎప్పుడైతే తనకు ఈ విషయం తెలిసిందో సదరు అధికారిని జీఏడీకి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. లోటస్ పాండ్ వద్ద కూల్చివేత ఎపిసోడ్ లో చంద్రబాబుకు ఏ మాత్రం సంబంధం లేదన్న విషయాన్ని చెప్పే క్రమంలో.. ముఖ్యమంత్రిగా తనకు తెలీకుండా తన మంత్రులు చేసే పనుల్ని రేవంత్ భలేగా చెప్పారన్న వ్యాఖ్య వినిపిస్తుండటం గమనార్హం.