మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే ఎగ్జాట్ పోల్స్ కూడా ఉండటంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డిని తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రిగా డిసైడ్ చేసినట్లేనన్న ప్రచారం జరిగినప్పటికీ వాస్తవంలో మాత్రం అలాంటి పరిస్థితి చోటు చేసుకోలేదు. సీనియర్ల నుంచి ఎదురైన అభ్యంతరాల నేపథ్యంలో.. ముఖ్యమంత్రి ఎంపికను మరో మూడు రోజులు ఆలస్యంగా ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. మంగళవారం నుంచి మంచి రోజులు లేకపోవటం.. ఏడో తారీఖు ప్రమాణస్వీకారం చేసేందుకు వీలుగా కాంగ్రెస్ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో పాటు.. ప్రభుత్వ కూర్పు ఎలా ఉండాలన్న దానిపై కసరత్తు షురూ చేసినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ముఖ్యమంత్రితో పాటు ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉంటారని.. వారెవరరన్న దానిపైనా కసరత్తు పూర్తి అయినట్లుగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి పదవిని ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి అప్పజెప్పేందుకు సర్వం సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. ఆఖరి నిమిషంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్పించి.. ఆయనే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది.
అదే సమయంలో.. మిగిలిన సామాజిక వర్గాల సమీకరణాల్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు వీలుగా.. ముగ్గురు ఉప ముఖ్యమంత్రుల్ని ప్రకటిస్తారని చెబుతున్నారు. వీరిలో.. భట్టి ఒకరు కాగా.. సీతక్క.. షబ్బీర్ అలీలను ఎంపిక చేస్తారని చెబుతున్నారు. భట్టి ఎస్సీ కాగా.. ఎస్టీ కోటా కింద సీతక్క.. మైనార్టీల నుంచి షబ్బీర్ కు ప్రాతినిధ్యం వహించేలా ఒక ప్లాన్ ను సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. దాదాపుగా వీరికేపదవులు దక్కే వీలుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత ఉన్న నేపథ్యంలో డిప్యూటీ ముఖ్యమంత్రుల్లో మరో రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఉండే అవకాశం లేదని చెబుతున్నారు.
సీఎం రేసులో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేబినెట్ లో కీలక శాఖలు దక్కేలా కసరత్తు ఉంటుందని చెబుతున్నారు. ఏడో తేదీ ఉదయం ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం అనంతరం..డిప్యూటీ సీఎంలతో పాటు మంత్రివర్గంలోని వారు సైతం ప్రమాణస్వీకారం చేసేలా కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి.. ఈ మొత్తం ఎపిసోడ్ రూపురేఖల్ని మార్చేలా ఎవరైనా నిర్ణయం తీసుకుంటే తప్పించి.. ఈ లెక్కలు మారవని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.