ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. రాజకీయంగా ఉన్న వైరుధ్యాలు వారిని కలిపే అవకాశమే లేదు. అయినప్పటికీ వారిద్దరి నోటి నుంచి ఒకే రోజు ఒకేలాంటి మాటలు రావటం ఆసక్తికరమని చెప్పాలి. ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో జరిగిన ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. పేపర్ లీకేజీ వ్యవహారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లు కేసీఆర్ సర్కారు మీద తీవ్ర ఆరోపణలు చేయటం తెలిసిందే. మంత్రి కేటీఆర్ పేషీ చుట్టూ ఈ లీకేజీల వ్యవహారం ఉందన్న మాటను ఇరువురు నేతలు నోటి నుంచి వచ్చింది. దీనిపై తాజాగా సిట్ ఇరువురికి నోటీసులు పంపింది.
ఈ సందర్భంగా ఇరువురు నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నోటీసులు ఇస్తే భయపడతామా? అని పేర్కొన్న ఇద్దరు.. సిట్ కు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వద్ద ఉన్న ఆధారాల్ని ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. సిట్.. సీఎం జేబు సంస్థగా మారిందన్న ఈ ఇద్దరు.. కావాలంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జిను ఈ అంశంపై విచారణకు ఆదేశిస్తే తమ దగ్గర ఉన్న ఆధారాల్ని ఇస్తామని పేర్కొనటం గమనార్హం.
నోటీసుల పేరుతో విపక్షాల నోరు మూత పడేలా చేద్దామనుకున్నారా? అలాంటిదేమీ కుదరదని తేల్చేని బండి మాటలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో రేవంత్ సైతం ఇదే తరహాలో రియాక్టు కావటం గమనార్హం. ప్రతిపక్షాలపై దాడులు.. నిషేధాల పేరుతో నోరు నొక్కేస్తున్నట్లుగా మండిపడుతున్నారు. ఇరువురు సిట్ నోటీసుల్ని పట్టించుకోమని తేల్చేయటంతో ఇప్పుడేం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ ఇరువురు ముఖ్యనేతలు సిట్ నోటీసులపై ఒకేస్థాయిలో.. ఒకేలాంటి వ్యాఖ్యల్ని సంధించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ నోటీసుల పర్యవసానం ఏ రీతిలో ఉండనుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.